బాలికా పైల్వాన్ కీర్తి.. ఎందరికో స్ఫూర్తి
హుబ్లీ: వెనుకబడిన కళ్యాణ కర్ణాటకలోని విజయనగరలో థియోసాఫికల్ కళాశాల విద్యార్థిని జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక కావడంపై కన్నడ యువత, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అత్యుత్తమ సాధన చేయడం ద్వారా జాతీయ స్థాయిలో రాణించి నగరానికి మంచి పేరు తేవాలని తన ఆశయం అని ఆ కళాశాలలో బీబీఎం చదువుతున్న సత్యశ్రీ తెలిపారు. వివిధ సౌకర్యాల కొరత ఉన్నా కూడా నిరంతర సాధనతో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో తొలిస్థానం సాధించి జాతీయ స్థాయిలో పాల్గొనడానికి అర్హత సాధించింది.
ప్రత్యర్థులను మట్టి కరిపించడంలో దిట్ట
యువ కర్ణాటక రక్షణ వేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌కుమార్ ముద్దుల కుమార్తె సత్యశ్రీ. 76 కేజీల తూకం గల ఆమె సంబంధిత కుస్తీ పోటీల్లో ప్రత్యర్థులను మట్టి కరిపించడంలో దిట్ట. మరియమ్మనహళ్లి హనుమంత, శివమొగ్గ సంజీవ్ అనే ఇద్దరు వ్యక్తులు సత్యశ్రీకి ప్రస్తుతం తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు ఎన్నో మెలకువలను నేర్పుతున్నారు. ఆమె తన విజయ పరంపర కొనసాగిస్తున్నారు. ఒలంపిక్ కుస్తీ క్రీడాకారిణి వినేష్ పొగట్‌తో పాటు కొప్పళ గవిసిద్దేశ్వర కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఈశప్ప దొడ్డమని ఈ కండల యువరాణికి ప్రేరణ ఇచ్చారు.
కుస్తీ పోటీల బరిలోకి దించింది
ఈశప్ప దొడ్డమని
ఈమెను తొలిసారిగా బస్తీమే సవాల్ అంటూ కుస్తీ పోటీల బరిలోకి దించింది ఈశప్ప దొడ్డమని. స్థానికంగా జరిగే పండుగలు, పబ్బాలు, జాతరలు తదితరాల సందర్భంగా కుస్తీ తదితర పోటీలలో నాలుగు సార్లు పాల్గొని రాష్ట్ర స్థాయిలో బహుమతులను సాధించారు. ఆనెగుంది, మైసూరు దసరా ఉత్సవాల్లో కూడా సత్యశ్రీ పాల్గొన్నారు. పలు బహుమతులను దక్కించుకున్న తన సాధనకు తల్లిదండ్రుల సహకారం, అండదండ కారణం అన్నారు. అమ్మాయి అని చూడకుండా అబ్బాయిలా పెంచి పోషించి లక్షలాది యువతకు ప్రేరణగా నిలిచిన సత్యశ్రీ కుస్తీ పోటీల్లో మరింతగా రాణించి భారతీయ మహిళగా కుస్తీ పోటీల్లో సుస్థిర స్థానాన్ని సాధించాలని కన్నడిగులు ఆకాంక్షిస్తున్నారు.
రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో
తొలిస్థానం సత్యశ్రీదే
జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు
ఎంపికై న వైనం


