రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
బళ్లారిటౌన్: రైతు సమస్యలను వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా కృషిక్ సమాజం పని చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయ స్వామి పేర్కొన్నారు. శనివారం నగరంలోని తాలూకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కృషిక్ సమాజం నూతన కట్టడాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రానికి పూర్వం ప్రారంభించిన కృషిక్ సమాజం తనదైన చరిత్రను సృష్టించిందన్నారు. రైతుల శ్రేయోభివృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని తాలూకాల్లో మరిన్ని భవనాలను నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలో 36 తాలూకాల్లో భవనాలు నిర్మాణంలో ఉన్నాయని, ఇంకా కావాల్సి ఉందన్నారు. తాలూకా స్థాయిలో ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.27 లక్షలు, జిల్లా స్థాయిలో రూ.50 లక్షలు ఇవ్వాలని కోరారు. సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. త్వరలో హొసపేటెలో చక్కెర కర్మాగారాన్ని కూడా పునరుద్ధరిస్తారన్నారు. ఎంపీ తుకారాం మాట్లాడుతూ జిల్లాలో 2.81 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని గుర్తు చేశారు. వ్యవసాయ శాఖ జేడీ సోంసుందర్, నేతలు ముండ్రగి నాగరాజు, చిదానందప్ప, గాదెప్ప, విశాలాక్షి కుమారస్వామి, మంజునాథ తదితరులు పాల్గొన్నారు.


