
త్వరలో తుమకూరులో క్యాన్సర్ ఆస్పత్రి
తుమకూరు: తుమకూరు నగరంలోని జిల్లా ఆస్పత్రి ఆవరణలో నూతనంగా నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రి (ఫెరిఫెరల్ క్యాన్సర్ సెంటర్) భవనాన్ని వైద్య విద్యామంత్రి శరణ ప్రకాష్ ఆర్.పాటిల్ గురువారం పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ సుమారు రూ.67 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 100 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిని సీఎం సిద్దరామయ్య నవంబర్ 7న ప్రారంభిస్తారని తెలిపారు. అలాగే తల్లీబిడ్డల ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ భవనాలను ప్రారంభిస్తారన్నారు. రోగులకు చికిత్స కోసం మొదటి దశలో రూ.41 కోట్ల వ్యయంతో వైద్య పరికరాలను సమకూరుస్తామన్నారు.
కిద్వాయిపై తీవ్ర ఒత్తిడి
ప్రతి రోజూ సుమారు 20–30 మంది క్యాన్సర్ రోగులు జిల్లాస్పత్రికి చికిత్స కోసం వస్తుండగా, వారిని బెంగళూరులోని కిద్వాయి ఆస్పత్రికి పంపుతున్నారన్నారు. కిద్వాయికి అన్ని జిల్లాలు, వేరే రాష్ట్రాల నుంచి క్యాన్సర్ రోగులు వస్తుండడంతో ఒత్తిడి పెరిగిపోయిందన్నారు. అందుకే క్యాన్సర్ బాధితుల కోసం అన్ని జిల్లాల్లో క్యాన్సర్ ఆస్పత్రులను ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 24 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రజలకు సత్వర సేవల కోసం ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు జీబీ జ్యోతిగణేష్, సురేష్‌గౌడ, వైద్యవిద్యా శాఖ డైరెక్టర్ సుజాతా రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.