
కనకదుర్గమ్మకే నమ్మకద్రోహం.!
సాక్షి బళ్లారి: కోరిన కోర్కెలు తీర్చే, భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతూ కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే కనక దుర్గమ్మ ఆలయంలో పని చేసే పూజారుల తీరు భక్తుల హృదయాలను కలిచివేస్తోంది. బళ్లారి కనకదుర్గమ్మ అంటే ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజించి తమ కోర్కెలను తీర్చుకుని పునీతులవుతున్నారు. బళ్లారి కనకదుర్గమ్మ ఆలయానికి చారిత్రాత్మక, మహిమాన్విత ఆలయంగా గుర్తింపు ఉంది. ఇక్కడ అమ్మవారిని ఏ పూజారో లేదో భక్తులో ప్రతిష్టించిన విగ్రహం కాదు. సాక్షాత్తు అమ్మవారు స్వయంభువుగా వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ తరిస్తున్నారు. ఇలాంటి గొప్ప, మహిమాన్విత, చారిత్రాత్మకమైన కనక దుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించే పూజారుల తీరు, అమ్మవారి ఆలయంలో కానుకలను అక్రమంగా తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం యావత్ భక్త కోటిని తీవ్రంగా కలిచివేస్తోంది.
నెల నెలా రూ.10 లక్షల
విలువైన కానుకల తరలింపు
ఎంతో పవిత్రంగా, నమ్మకంగా అమ్మవారిపై ఉన్న భక్తితో ఆలయానికి వచ్చి కానుకలు సమర్పిస్తే వాటిలో కనీసం నెలకు దాదాపు రూ.10 లక్షలకు పైగా విలువ చేసే వివిధ రకాల కానుకలను తరలిస్తున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొనడం గమనార్హం. పూజారుల తీరు, అక్రమంగా తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కనక దుర్గమ్మ ఆలయ ఉన్నతాధికారులు ప్రమోద్, హనుమంతప్ప పూజారులకు నోటీసులు కూడా జారీ చేయడం గమనార్హం. కనక దుర్గమ్మ ఆలయంలో పని చేసే, పూజలు అందించే పూజారులకు అధికారికంగానే హారతిలో వేసే నగదు పూర్తిగా పూజారులకే చెందుతుంది. ఇది కాకుండా ఆకు పూజ చేసేందుకు రూ.2500లు భక్తులకు రసీదు చెల్లిస్తే ఇందులో పూజారులకు రూ.1250లు, అమ్మవారికి అభిషేకం రూ.1000లు, కుంభం రూ.1000లు, గండ దీప పూజ రూ.1000లు, కుంకుమార్చనకు రూ.100లు, వాహనాల పూజకు రూ.100ల నుంచి రూ.200లు ఇలా ఆలయంలో ప్రభుత్వం నియమించిన దేవదాయ శాఖ అధికారుల నుంచి భక్తులు రసీదు తీసుకొని పూజలు చేయిస్తారు.
అధికారిక ఆదాయంతో పాటు
భారీగా అక్రమ స్వాహా
ఈ పూజల ద్వారా ప్రతి నెల కనీసం రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఆలయానికి ఆదాయం వస్తుంది. ఇందులో పూజారులకు సగం చెల్లించాలి. అంటే కనీసం అక్కడ పని చేసే పూజారులకు ప్రతి నెల రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు అధికారికంగానే దేవదాయ శాఖ అధికారులు చెల్లిస్తారు. ఇక హారతిలో వేసే నగదును లెక్కించరు. ఆరోజు ఏ పూజారి పూజ చేస్తారో వారికే ఆ నగదు చేరుతుంది. ఇలా అధికారికంగా నెలకు అమ్మవారి ఆలయం నుంచి లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా అనధికారికంగా కూడా పెద్ద ఎత్తున పూజలు, కానుకలను స్వాహా చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అనధికారికంగా, అక్రమంగా పూజారులు తీసుకెళ్లే మచ్చుకు కొన్ని ఉదాహరణలుగా అధికారులు వెల్లడిస్తున్న ప్రకారం అమ్మవారికి చీరలు, ఒడి బియ్యం, బంగారు వెండి ఆభరణాల ద్వారా నెలకు రూ.10 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని వెల్లడించారు. ప్రతి నెల దాదాపు 8 క్వింటాళ్ల బియ్యం, ఒక క్వింటాల్ బెల్లం, ఒక క్వింటాల్ కొబ్బరి, వీటితో పాటు అమ్మవారికి సమర్పించే విలువైన చీరలు 1000 నుంచి 2000 దాకా వస్తాయని, ఒక్కొక్క చీర ఖరీదు రూ.500 నుంచి రూ.30 వేల దాకా ఉంటుందని అంచనా. ఇలా అమ్మవారికి సమర్పించిన బంగారు, వెండి, ధాన్యాలు, చీరలను ఆలయ అభివృద్ధికి అందించకుండా పూజారులే తరలిస్తున్నారని ఆలయ కమిటీ అధికారులు నోటీసులు జారీ చేయడం నగరంతో పాటు భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది.
అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు
భక్తుల కొంగుబంగారం కనక దుర్గమ్మ ఆలయం
ఆలయంలో భక్తులిచ్చిన కానుకలను కాజేస్తున్న పూజారులు?
గుడి నుంచి కానుకల తరలింపు
దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
అమ్మవారి భక్తుల హృదయాలను
కలిచివేస్తున్న పూజారుల వైఖరి

కనకదుర్గమ్మకే నమ్మకద్రోహం.!

కనకదుర్గమ్మకే నమ్మకద్రోహం.!