
పాత్రికేయులు సమాజానికి వారథులు
రాయచూరు రూరల్: సమాజానికి పాత్రికేయులు వారథుల్లాంటి వారని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సుల్తాన్‌పుర శంబు సోమనాథ శివాచార్య పేర్కొన్నారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రాయల వాణి కన్నడ దినపత్రిక పంచమ వార్షికోత్సవం, అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సమాజానికి సేవలందించిన వారికి జీవమాన సాధక అవార్డులు అందించి మాట్లాడారు. నేడు యువత పత్రికా రంగంలో సేవలందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. సమాజంలో పేరుకు పోయిన సమస్యలపై స్పందించాలన్నారు. సోషల్ మీడియా ప్రభావం అధికమైందన్నారు. సమావేశంలో జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, ఉపాధ్యక్షుడు బషీర్, సిండేకేట్ సభ్యుడు చెన్నబసవ నాయక్, శివప్ప నాయక్, రంజిత సిద్దలింగ స్వామి, అమరేష్‌లున్నారు.
పొగాకు ఉత్పత్తులను నిషేధించండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను నిషేధించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు భీమేష్ మాట్లాడారు. గంజాయి, హుక్కా, పొగాకు వంటి అంశాలతో కూడిన మత్తు పదార్థాల సేవనంతో యువకులు, విద్యార్థులు దారి తప్పుతున్నారని, అలాంటి వాటిని పూర్తిగా నిషేధించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా పాండు, ప్రమీత్, భాగ్యలక్ష్మి, రంగనాథ్‌లున్నారు.
సమస్యలు పరిష్కరించరూ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కార్మిక, రైతు, దళిత, పేద, బడుగు బలహీన వర్గాల వారి, వ్యవసాయ కూలీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత వ్యవసాయ కూలీ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం అధ్యక్షుడు హనుమంతు మాట్లాడారు. ఏపీఎంసీ, విద్యుత్, రైల్వే ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల జారీకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
నరేగపై జాగృతి జాతా
రాయచూరు రూరల్: జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ)పై రైతుల్లో ప్రచారం చేపట్టాలని జిల్లా సంయోజకుడు విశ్వనాథ్ పిలుపునిచ్చారు. గురువారం తాలూకాలోని బాపుర పంచాయతీ కార్యాలయం వద్ద ఖాత్రి పథకం కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. జిల్లాలో నరేగ పనులు చురుకుగా కొనసాగేలా చూడాలని పంచాయతీ అధికారులకు వివరించారు. వ్యవసాయ నీటి కుంటలు, గొర్రెల షెడ్, చెక్‌డ్యాం, తోటల పెంపకం, అటవీ శాఖ, వ్యవసాయం, పట్టు పంటలు వంటి వాటిపై ప్రజలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వ్యవసాయ కూలీలకు రోజు రూ.349 కూలీ, వంద రోజుల పనులు కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో ధనరాజ్, రెడ్డి, ఈరప్పలున్నారు.
జేడీయూ అభ్యర్థి ప్రచారం
చిక్కబళ్లాపురం : ఆగ్నేయ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో జేడీయూ తరఫున బరిలో ఉన్న డాక్టర్ నాగరాజ్ గురువారం నగరంలోని ఎంజీ రోడ్డులో ఉన్న డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థుల మద్దతు కోరారు. తనను గెలిపిస్తే పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ప్రిన్సిపాల్ వసుంధర, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ చంద్రయ్య, డాక్టర్ నరసింహమూర్తి, రఘు తదితరులు పాల్గొన్నారు.

పాత్రికేయులు సమాజానికి వారథులు