
రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టండి
హొసపేటె: అన్నభాగ్య పథకం కింద పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ పంపిణీ చేయాలని గ్యారెంటీ పథకాల అమలు కమిటీ జిల్లా చైర్మన్ కే.శివమూర్తి అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం నగరంలోని జెడ్పీ కార్యాలయ సభాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఐదు హామీ పథకాల అమలుపై జరిగిన జిల్లా స్థాయి ప్రగతి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. అన్నభాగ్య పథకం కింద పంపిణీ చేసే రేషన్ ధాన్యాలను విక్రయించరాదన్నారు. పంపిణీ చేసే ముందు ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేయాలన్నారు. రేషన్ పంపిణీ కేంద్రాల్లో అన్నభాగ్య పథకం నామ ఫలకాన్ని ఏర్పాటు చేయాలన్నారు. బ్లాక్ మార్కెట్‌లో కొంతమంది అక్రమంగా రేషన్ బియ్యాన్ని విక్రయిస్తున్నారని, అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. హొసపేటెలోని చిత్తవాడిగి ప్రాంతంలో రాత్రి పూట రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. అలాంటి వారిపైఅధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
అక్రమ రవాణాపై 31 కేసుల నమోదు
ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్ అహ్మద్ స్పందిస్తూ జిల్లాలో అక్రమ స్మగ్లర్లపై ఇప్పటికే 31 కేసులు నమోదు చేశామన్నారు. చిత్తవాడిగిలో జరుగుతున్న అక్రమాలపై త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. గృహజ్యోతి పథకం కింద నమోదు కాని దరఖాస్తులను తనిఖీ చేసి, సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. పథకాల అమలులో జిల్లా మంచి పురోగతి సాధించింది. భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమాలను అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఐదు హామీ పథకాల లబ్దిదారులతో తాలూకాల వారీగా సమావేశాలు నిర్వహించాలి. అధికారులు చౌకడిపో దుకాణ యజమానులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేషన్ పంపిణీ చేయాలని తెలిపారు. జెడ్పీ సీఈఓ మహ్మద్ నోంగ్జాయ్ అక్రమ్ షా, అధికారులు పాల్గొన్నారు.

రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టండి