
ఏడు జిల్లాల్లో కళ్యాణ సంపద మార్కెట్లు
బళ్లారిటౌన్: కళ్యాణ కర్ణాటక పరిధిలోని ఏడు జిల్లాల్లో రైతులకు ఉపయోగపడేలా కళ్యాణ సంపద మార్కెట్లను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గురువారం జిల్లాలోని బళ్లారి తాలూకా కొంచిగేరిలో మిర్చి రైతుల కోసం ఏర్పాటు చేసిన మిర్చి పౌడర్ విత్తనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి యూనిట్ల స్థాపనకు నాబార్డ్, ఐటీసీ లాంటి సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. వీటితో పాటు బళ్లారి జిల్లాలో సిద్దగంగాశ్రీ ఫుడ్ ఎఫ్‌డీఏ కూడా సహకారం అందించిందన్నారు. విజయనగరలో చింతపండు, కొప్పళలో చెరుకు, బీదర్‌లో పత్తి, కలబుర్గిలో జొన్నలు, యాదగిరిలో సోయాబీన్‌కు, రాయచూరులో వరి పంటకు అనుకూలంగా రైతుల పంటలకు గిట్టుబాటు ధర లభించేలా రైతులే వాటిని తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకొనేలా మార్కెట్లను ప్రారంభిస్తామన్నారు. ఇటీవల ప్రధానమంత్రి రైతుల కోసం 100 జిల్లాల్లో ప్రధానమంత్రి కృషి ధన్ ధాన్య పథకం ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకం ద్వారా వారే ధాన్యాన్ని పండించి దానికి తగ్గట్టు మిల్లులు ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకొనేలా ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు రసాయనిక ఎరువులు, మందులు వాడకుండా సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. సిరుగుప్ప ఎమ్మెల్యే నాగరాజ్, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వైఎం సతీష్, రవికుమార్, నాబార్డ్ అధికారి షాదీ, ఏబీసీ చెర్మన్ సందీష్ పూరి, రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఉమామహాదేవ, బ్యాంకింగ్ సర్వీసు అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ గ్రంథాలయం సందర్శన
సిరుగుప్ప: నగరంలో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సిరుగుప్ప తాలూకా బాగేవాడి గ్రామంలో రూ.24 లక్షలతో నిర్మించిన డిజిటల్ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, జిల్లా అధ్యక్షుడు అనిల్ నాయుడు, మండల అధ్యక్షులు మల్లికార్జునస్వామి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యే బీ.ఎం.నాగరాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సాగును లాభదాయకంగా మార్చాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సాంకేతిక రంగంలో వ్యవసాయ రంగాన్ని లాభదాయక పరిశ్రమగా మార్చుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. గురువారం సింధనూరు తాలూకా జవళగేరలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్కరణలు, ఉద్యమ శీలత ప్రధానమంత్రి ధన్ ధాన్య వ్యవసాయ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాంకేతిక సహాయం అందించిందన్నారు. గ్రామాల్లో ఉద్యోగాలను కల్పించడానికి పీఎండీవైఓ పథకంలో 2025–26లో రూ.24 వేల కోట్ల నిధులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో అధికారులు నాగరాజ్, కె.వి.శాజి, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ పుట్టమాదయ్య, నేతలు విరుపాక్షప్ప, వెంకట్రావ్ నాడ గౌడ, నాగలింగ తదితరులున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఏడు జిల్లాల్లో కళ్యాణ సంపద మార్కెట్లు