
బోల్తాపడిన టెంపో ట్రావెలర్
శివమొగ్గ: వేగంగా వెళ్తున్న టెంపో ట్రావెలర్ వాహనం అదుపు తప్పడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న సుమారు 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శివమొగ్గ జిల్లా, సాగర తాలుకా సిగందూరు రోడ్డులో ఉన్న హులిదేవరబన సమీపంలోని కోరనకొప్ప గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గాయపడిన వారందరూ బెంగళూరు నగరానికి చెందిన వారని గుర్తించారు. బెంగళూరుకు చెందిన కొందరు సిగందూరు దేవాలయానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తొలుత బెంగళూరు నగరం నుంచి సాగర వరకు రైలులో వచ్చారు. అక్కడి నుంచి సిగందూరుకు అద్దెకు టెంపో ట్రావెలర్ వాహనం మాట్లాడుకుని బయలుదేరారు. హులిదేవరబన సమీపంలోని కోరనకొప్ప గ్రామం వద్దకు చేరుకోగానే.. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయిన టెంపో ట్రావెలర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రెక్ వేశాడు. అదుపుతప్పిన వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సాగర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
14 మంది ప్రయాణికులకు గాయాలు