
వాలిన 3 అంతస్తుల భవనం
● నెలమంగళలో కలకలం
దొడ్డబళ్లాపురం: బెంగళూరు లో భవనాలు వాలిపోవడం పరిపాటిగా మారుతోంది. కోరమంగళలోని జక్కసంద్రలో చిన్న స్థలంలో 5 అంతస్తుల భవనాన్ని కట్టగా, అది వారంరోజుల కింద వాలిపోవడంతో కూల్చివేస్తున్నారు. ఇంతలోనే నెలమంగల సమీపంలోని మాదావరలో ఒక భవనం ఒరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం శ్రీనివాస్ అనే వ్యక్తి నిర్మించిన ఈ మూడు అంతస్తుల భవనం హఠాత్తుగా అర అడుగు మేర పక్కకు వాలింది. దీంతో ఇందులో నివసిస్తున్న 6 కుటుంబాలు భవనాన్ని ఖాళీ చేశాయి. నాసిరకంగా కట్టినట్లు స్థానికులు ఆరోపించారు. యజమాని మాట్లాడుతూ తాను కాంట్రాక్టర్‌నని, తన ఇంటిని ఎందుకు నాణ్యత లేకుండా కట్టుకుంటానని అన్నాడు. రూ.80 లక్షల ఖర్చుతో పటిష్టమైన పిల్లర్‌లు వేసి ఇల్లు కట్టించానన్నాడు. పోలీసులు, నగరసభ అధికారులు భవనాన్ని పరిశీలించారు. ఆనుకుని ఉన్న ఇళ్లవారిని ఖాళీ చేయాలని సూచించారు. దీనిని కూల్చివేసే అవకాశాలున్నాయి.
రోడ్ల గుంతలు, చెత్త ఉండరాదు
బనశంకరి: బెంగళూరు కేంద్ర నగర పాలికె పరిధిలో రోడ్ల గుంతలను పూడ్చివేయాలని ఆ ప్రాంత పాలికె కమిషనర్ రాజేంద్రచోళన్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం చిక్కపేటేలో స్కూటర్లలో సంచరిస్తూ పలు రోడ్లను పరిశీలించారు. రోడ్ల గుంతలను సరిచేసి జీబ్రా క్రాసింగ్‌లు, మార్కింగ్‌లు వేయాలని తెలిపారు. జంక్షన్లలో మిగిలిపోయిన మరమ్మతులు చేయాలన్నారు. హోసూరురోడ్డు అధ్వాన్నంగా ఉందని, తారు వేయాలని తెలిపారు. రోడ్ల పక్కన చెత్త రాశులను చూసి వెంటనే తొలగించాలని ఆదేశించారు. జేసీ రోడ్డులోని నగరపాలికె స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి అభివృద్ధి చేయాలన్నారు. అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

వాలిన 3 అంతస్తుల భవనం