కృష్ణరాజపురం: సిలికాన్ సిటీలో విపరీతమైన వాహన రద్దీ, గుంతల రోడ్లు కలిసి యువత ప్రాణాలను తీస్తున్నాయి. తరచూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడమో, తీవ్ర గాయాలు కావడమో జరుగుతున్నా సర్కారులో చలనం రావడం లేదు. కాలేజీకి వెళుతున్న విద్యార్థినిని టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిన ప్రమాదంలో ఆమె అక్కడే దుర్మరణం చెందింది, ఈ దుర్ఘటన బెంగళూరులోని కృష్ణరాజపురం ట్రాఫిక్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆవులహళ్ళి మెయిన్‌రోడ్డులో జరిగింది. వివరాలు.. నారాయణమఠం నివాసి అయిన ధనుశ్రీ (22) అనే యువతి ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం రెండో ఏడాది చదువుతోంది. సోమవారం ఉదయం 8:30 గంటలకు ఆమె కాలేజీకి స్కూటర్లో బయల్దేరింది. భూదిగెరె క్రాస్ రోడ్డులో ఎక్కడ చూసినా గుంతలు తేలాయి. ఆమె గుంతలను తప్పించుకుని నెమ్మదిగా వెళ్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ లారీ స్కూటర్‌ను ఢీకొని ఆమె మీద నుంచి వెళ్లిపోయింది. కిందపడి తీవ్ర గాయాలు అయిన ధనుశ్రీ రక్తపుమడుగులో ప్రాణాలు విడిచింది. మృతదేహం నుజ్జునుజ్జయి శరీరభాగాలు చెల్లాచెదరుగా పడ్డాయి. స్థానికులు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆవులహళ్ళి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గంటలకొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. లారీ కోసం గాలింపు చేపట్టారు.
బెంగళూరులో ఘోరం
గోతుల రోడ్లు.. లారీ అతివేగం.. విద్యార్థిని దుర్మరణం
గోతుల రోడ్లు.. లారీ అతివేగం.. విద్యార్థిని దుర్మరణం