
మహిషాసుర మర్దిని
తుమకూరు: తుమకూరు దసరా వేడుకల్లో కేఆర్ లేఔట్‌లో ఉన్న శ్రీరామ మందిరంలో సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. మహిషాసుర మర్దిని నృత్య వైభవం సమ్మోహితుల్ని చేసింది. అలాగే హిరణ్యక సంహార ఘట్టం, జానపద కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
భార్యను హత్య చేసి..
భర్త ఆత్మహత్య
యశవంతపుర: భార్యను 15 సార్లు కత్తితో పొడిచి చంపి, ఆపై భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు జ్ణానభారతి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఉళ్లాళ మెయిన్ రోడ్డు ప్రైస్ లేఔట్‌లో నివాసం ఉంటున్న మంజు (27), ఆమె భర్త ధర్మశీలన్ (29) మృతులు. తమిళనాడుకు చెందిన ధర్మశీలన్ దుబాయ్‌లో పెయింటర్‌గా పని చేసేవాడు. తరువాత బెంగళూరుకు వచ్చి ఓ ఇంటిలో బాడుగకు దిగారు. వ్యాపారం చేసేవాడు. అతడు మద్యానికి అలవాటు పడ్డాడు. దీంతో తరచూ భార్యతో గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. ఆదివారం రాత్రి కూడా పెద్ద రగడ జరిగింది. ఈ ఆవేశంలో అకృత్యానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం పోలీసులు కేసు నమోదు చేశారు.
వర్ష బాధితులను
పట్టించుకోరా?
● సర్కారుకు బీజేపీ ప్రశ్న
శివాజీనగర: కళ్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక భాగంలో 8కి పైగా జిల్లాల్లో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం వర్ష బాధితుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర, బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ నేతృత్వంలో రెండు బృందాలు ఆయా జిల్లాలలో పర్యటించాయి. ఓవైపు అతివృష్టి, నదులు ఉప్పొంగి ఇబ్బందులు పడుతున్నా పరిష్కార చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. పలు ప్రదేశాలలో ఇళ్లు కూలిపోగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ బాధితులను కలిసింది లేదని దుయ్యబట్టారు.
ఆ భవనాలకూ నీరు,
కరెంటు వసతి!
శివాజీనగర: గ్రేటర్ బెంగళూరు పరిధిలో, రాష్ట్రంలో వివిధ చోట్ల పెద్ద స్థలాల్లో ప్లాన్ అనుమతి పొందకుండా, ప్లాన్ ఉల్లంఘించి నిర్మించిన భవనాలకు విద్యుత్, నీటి కనెక్షన్ల అంశం మీద సీఎం సిద్దరామయ్య సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. 30 ఇన్‌టు 40 చదరపు గజాల్లో అనుమతులు లేకుండా కట్టిన ఇళ్లకు కరెంటు, నీటి కనెక్షన్లు ఇవ్వాలని గతంలో సర్కారు ఆదేశించింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న భవనాలకు కూడా ఇలాంటి వెసులుబాటు ఇవ్వడంపై చర్చించారు. చివరకు వాటికి కూడా ఓసీ, సీసీ ద్వారా రాయితీ ఇవ్వడానికి ఆమోదం తెలిపారని అధికారులు చెప్పారు. ఈ భేటీలో ఇంధన మంత్రి కే.జే.జార్జ్, నగరాభివృద్ధి మంత్రి భైరతి సురేశ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.