
రాయలసీమ రైతులకు న్యాయం చేయాలి
బనశంకరి: కేంద్ర ప్రభుత్వం రాయలసీమ పై కళ్లు తెరవాలని, తరతరాలుగా రాయలసీమ కు పాలకులు అన్యాయం చేస్తున్నారని రాయలసీమ రాష్ట్రసమితి వ్యవస్దాపక అద్యక్షుడు ఉద్యమనేత డాక్టర్ కుంచం వెంకటసుబ్బారెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ద్వజమెత్తారు. సోమవారం యలహంకలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రాయలసీమరైతులు కష్టాలు ఏనాటికి నెరవేరుతాయో కాలమే చెప్పాలన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జలయజ్ఞం పేరుతో రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జలయజ్ఞంలో మరో ముఖ్యమైన ప్రాజెక్టు దుమ్ముగూడెం నాగార్జున టైల్ పాండ్ ఆయన మరణంతో నిలిచిపోయిందన్నారు. ఆయన జీవించి ఉంటే 160 టీఎంసీల గోదావరిజలాలను నాగార్జునసాగర్‌లోనికి పంపి, ఆ మేరకు కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు మళ్లించి ఉండేవారన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తామని అవాస్తవాలు చెప్పారన్నారు. ఈసారైనా గోదావరి జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు తరలిస్తారని రైతులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారని, ఆ మేరకు ప్రభుత్వం సాకారం చేయాలని డిమాండ్ చేశారు.