
శారదామాత నమోస్తుతే
కోలారు: శరన్నవరాత్రుల సందర్భంగా నగరంలోని శంకరమఠంలో ఉన్న శ్రీశారదా మాత ఆలయంలో అమ్మవారికి తామర పుష్పాలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం చేసి విశేషాలంకరణ చేశారు. సాయంత్రం మహిళలు లలితా సహస్రనామం పఠించారు.
శిశువు తండ్రి అతడే..
తేల్చిన డీఎన్‌ఏ టెస్టు
యశవంతపుర: దక్షిణకన్నడ జిల్లా పుత్తూరు బీజేపీ నాయకుడు జగన్నివాస్‌రావు కుమారుడు కృష్ణాజీరావ్ ఓ యువతిని ప్రేమపేరుతో మభ్యపెట్టి వాంఛలు తీర్చుకున్నాడు, ఆమె గర్భం దాల్చి శిశువు జన్మించగా తనకు సంబంధం లేదని కృష్ణాజిరావ్ ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం కోర్టుకెళ్లింది. కోర్టు ఆదేశాలతో తల్లీ బిడ్డ, నిందితుని నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి పరిశీలించారు. ఈ కేసులో మహత్వమైన తీర్పు వచ్చింది. శిశువు, కృష్ణాజిరావ్ డీఎన్‌ఏ ఒక్కటేనని నిర్ధారణ అయ్యింది. దీంతో అతడే తండ్రి అని శాసీ్త్రయంగా నిర్ధారణ అయినట్లు యువతి కుటుంబీకులు, విశ్వకర్మ సంఘం నాయకులు తెలిపారు. మంగళూరులో వారు విలేకరులతో మాట్లాడారు. కొద్దిరోజుల నుంచి యువతి కుటుంబం న్యాయం కోసం పోరాటం చేస్తోంది. పుత్తూరు కోర్టు ఆదేశాల మేరకు రక్తనమూనాలను సేకరించి డీఎన్‌ఏ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు.
బెంగళూరు– ముంబై మధ్య త్వరలో సూపర్‌ఫాస్ట్ రైలు
శివాజీనగర: ఉద్యాననగరి– ముంబై మహానగరాల మధ్య కొత్త సూపర్‌ఫాస్ట్ రైలుకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదించిందని బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య సోషల్ మీడియాలో తెలిపారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బెంగళూరు, ముంబై మధ్య తాము త్వరలోనే సూపర్‌ఫాస్ట్ రైలును ప్రారంభిస్తామని తెలిపారన్నారు. ప్రధాన ఆర్థిక నగరాలైనప్పటికీ బెంగళూరు, ముంబై మధ్య ఉద్యాన ఎక్స్‌ప్రెస్ ఒక్క రైలే నడుస్తోందని చెప్పారు. సుమారు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి 24 గంటల కంటే అధిక సమయం పడుతోంది. 30 సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న డిమాండ్ త్వరలో తీరుతోందన్నారు. గతేడాది 26 లక్షల మందికి పైగా ఈ రెండు నగరాల మధ్య విమానంలో ప్రయాణించారన్నారు. సూపర్‌ఫాస్ట్ రైలుతో తక్కువ ఖర్చు, సమయంతో ప్రయాణం చేయవచ్చన్నారు.
బొమ్మల కొలువు ముచ్చట
బనశంకరి: దసరా అంటే బొమ్మల కొలువులను ఏర్పాటు చేయడం కొందరికి సరదా. బెంగళూరు జేపీ నగరలో రూపశ్రీ నివాసంలో దసరా బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. రకరకాల బొమ్మలతో అలంకరించారు. శనివారం కొలువు చుట్టూ మహిళలు చేరి భక్తి గీతాలు ఆలపించారు.
గజదళంతో రీల్స్‌కు
జరిమానాతో సరి
మైసూరు: మైసూరులో అంబా విలాస ప్యాలెస్ ఆవరణలో బస చేసిన దసరా ఏనుగులతో దొంగచాటుగా రాత్రివేళ ఫొటో, వీడియోలు తీసుకున్న నలుగురిపై అటవీ శాఖ జరిమానాస్త్రం సంధించింది. ఈ నెల 18న ఓ యువతి ఏనుగుల వద్ద రీల్స్ చేసిన వీడియో వైరలైంది. పోలీసు, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై జోరుగా విమర్శలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు గాలింపు జరిపి రీల్స్ చేసిన ప్రజ్వల్, ఎండీ రాఘవేంద్రలకు రూ.500, కే.నవీన్‌కు రూ.2 వేలు, యువతి కృతికి రూ.1000 చొప్పున జరిమానాలను విధించారు.

శారదామాత నమోస్తుతే

శారదామాత నమోస్తుతే