
కోముల్ భేటీలో ఎమ్మెల్యేల గొడవ
కోలారు: నగర సమీపంలోని నందిని ప్యాలెస్‌లో నిర్వహించిన కోముల్ సర్వ సభ్య వార్షిక సమావేశంలో పాలక మండలి తీర్మానాలపై డైరెక్టర్‌ల మధ్య న వాడి వేడి చర్చ జరిగింది. సమావేశంలో బంగారుపేట ఎమ్మెల్యే, కోముల్ డైరెక్టర్ అయిన ఎస్ ఎన్ నారాయణస్వామి, కోముల్ పాలనాధికారి డాక్టర్ మైత్రి అవధిలో తీసుకున్న పలు నిర్ణయాల పై ఆక్షేపణలు వ్యక్తం చేశారు. మైత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని దీని వల్ల పాడి రైతులకు నష్టం కలిగిందన్నారు. ఇందుకు మాలూరు ఎమ్మెల్యే, కోముల్ అధ్యక్షుడు కైవె నంజేగౌడ సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో మీరు పాలనాధికారి డాక్టర్ మైత్రి పరంగా ఎందుకు వకాలత్తు తీసుకుంటారని ప్రశ్నించారు. నారాయణస్వామి మాట్లాడుతూ గతపాలక మండలి తీసుకున్న నిర్నయాల పట్ల తమ అభ్యంతరం లేదని అయితే పాల సమాఖ్యకు జరిగిన నష్టం మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల పై తమ వ్యతిరేకత ఉందని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యన వాగ్వాదం తీవ్రం కాగా డైరెక్టర్‌లు, సభ్యులు ఇద్దరికి సర్ధిచెప్పారు. రైతుల సమస్యలపై చర్చకు బదులు రభస చోటుచేసుకుంది.