
అధికారులు సమర్థంగా పని చేయాలి
హొసపేటె: అధికారులు తమ ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ సూచించారు. శనివారం జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ప్రగతి పరిశీలన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లాలోని తమ కార్యాలయానికే పరిమితం కాకుండా జిల్లాలోని ఇతర తాలూకాలో ఉన్న తాలూకా కార్యాలయాలను సందర్శించి తనిఖీ చేయాలని ఆదేశించారు. అధికారులు ఆయా తాలూకాలను సందర్శించినప్పుడు తప్పకుండా మూమెంట్ బుక్‌ను మెయింటెయిన్ చేయాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అనేక తాలూకాల్లో ఉల్లి పంటకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. ఈ విషయంపై ఉల్లి పంటకు మద్దతు ధర కల్పించాలని హరపనహళ్లి ఎమ్మెల్యే లతా మల్లికార్జున జిల్లా మంత్రిని కోరారు.
బస్సు సౌకర్యం కల్పించండి
గ్రామీణ భాగంలో అనేక మంది విద్యార్థులకు సరిగ్గా బస్సు సౌకర్యం లేకుండా పోవడంతో విద్యార్థులు ట్రాక్టర్లలో వెళుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయం పై జిల్లా విద్యాశాఖ అధికారి తగిన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. వాతావరణం సరిగా అనుకూలించక పోవడంతో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతోందని, ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు అన్ని విధాలుగా ఉత్తమ వైద్య చికిత్స అందించాలని మంత్రి జిల్లా వైద్యాధికారి శంకర్‌నాయక్‌కు సూచించారు.
పక్కా సమాచారంతో రావాలి
అధికారులు సమావేశానికి వచ్చే ముందు పక్కా, సరైన సమాచారంతో హాజరు కావాలన్నారు. సరైన సమాచారం లేకుండా వస్తే సహించబోనని అన్నారు. అదే విధంగా వివిధ కార్యాలయాల్లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంపై సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ సందర్భంగా ఎంపీ ఈ.తుకారాం, ఎమ్మెల్యేలు నేమిరాజ్ నాయక్, లతా మల్లికార్జున, డాక్టర్ శ్రీనివాస్, కృష్ణనాయక్, జిల్లాధికారి కవితా ఎస్ మన్నికేరి, జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్ మహమ్మద్ అక్రమ్ షా, ఎస్పీ జాహ్నవి, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ, వివిధ శాఖల జిల్లా కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప్రారంభం
విజయనగర జిల్లా నూతన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తి ఆర్.నటరాజ్, మంత్రి జమీర్ అహమ్మద్‌ఖాన్ ప్రారంభించారు. హొసపేటె కోర్టు సముదాయం ప్రాంగణంలో ఉన్న జిల్లా కోర్టు ప్రారంభోత్సవానికి వధువులా అలంకరించారు. జిల్లా స్థాయి న్యాయమూర్తులు, జిల్లాధికారిణి కవితా మన్నికేరి, ఎస్పీ జాహ్నవి, జెడ్పీ సీఈఓ అక్రమ్ షా, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయనగర జిల్లా స్థాపితమైన నాలుగేళ్ల తర్వాత కూడా జిల్లా కోర్టు లేదు. న్యాయవాదుల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కల నెరవేరినట్లు కనిపిస్తోంది. ఏ సమస్య ఉన్నా ఇంతకు ముందు విజయనగర జిల్లా ప్రజలు కేసులను విచారించడానికి బళ్లారికి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం జిల్లా కోర్టు ప్రారంభం కావడంతో ఆ సమస్య పరిష్కారమైంది.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి
జమీర్ అహమ్మద్ ఖాన్
వాడీవేడిగా జిల్లా స్థాయి
ప్రగతి పరిశీలన సమావేశం

అధికారులు సమర్థంగా పని చేయాలి

అధికారులు సమర్థంగా పని చేయాలి