
డ్రగ్స్ రహిత బళ్లారిగా మారుద్దాం
సాక్షి బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అభివృద్దితో పాటు చెడు అలవాట్లకు కూడా యువత తొందరగా లోను కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే వాటికి దూరంగా ఉంటూ సన్మార్గంలో దేశ భవిష్యత్తుకు, తోడ్పాటుకు కృషి చేయాల్సిన అవసరముందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం జిల్లా బీజేపీ బళ్లారి నగరచ మండల, నగర యువ మోర్చా ఆధ్వర్యంలో డగ్స్ రహిత భారత్ సంకల్ప అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా కనక దుర్గమ్మ ఆలయం నుంచి నమో మారథాన్‌ను ప్రారంభించి యువతను ఉత్సాహపరిచేలా నేతలందరూ పాల్గొని మాట్లాడారు. నగరంలోని కనకదుర్గమ్మ ఆలయం నుంచి అండర్‌బ్రిడ్జి, రాయల్ సర్కిల్, జిల్లాధికారి కార్యాలయం నుంచి మోతీ సర్కిల్ వరకు మారథాన్ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ డ్రగ్స్ రహిత బళ్లారిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన అవసరముందన్నారు. యువత దేశాభివృద్ధికి మూల స్తంభాలన్నారు.
దురలవాట్లకు దూరంగా ఉండండి
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా మంచి నడక అలవర్చుకోవాలన్నారు. డ్రగ్స్, మద్యానికి ఎట్టిపరిస్థితుల్లోను అలవాటు పడకుండా ఉండాలన్నారు. డ్రగ్స్ అమ్మినా, కొన్నా చట్టరీత్య నేరమన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాటిని గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతూ కొందరు వ్యాపారాలు చేసుకుంటూ యువతను చెడు దారుల్లో నడిపిస్తున్నారన్నారు. తోటి స్నేహితులు, అలాంటి అలవాట్లకు దగ్గర ఉంటే వారిని కూడా మంచి మార్గంలో నడిపించాలని యువతకు సూచించారు. డ్రగ్స్ రహిత భారత్‌గా ప్రధాని మోదీ సంకల్పించారన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలుంటుందన్నారు. ఆరోగ్యాన్ని క్షీణింపజేసే డ్రగ్స్‌ను ముట్టకోకూడదన్నారు. ప్రభుత్వాలు కూడా డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బీజేపీ ప్రముఖులు డాక్టర్ బీకే.సుందర్, కేఎస్.దివాకర్, గుర్రం వెంకటరమణ, కోనంకి తిలక్, ఐనాథ్‌రెడ్డి, హనుమంతప్ప, విరుపాక్షిగౌడ తదితరులు పాల్గొన్నారు. వివిధ కళాశాలల విద్యార్థులు నమో మారథాన్‌లో పాల్గొన్నారు.
నేటి బాలురే రేపటి దేశ పౌరులు
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి