
దీన్‌దయాళ్ సేవలు మరువలేనివి
సాక్షి, బళ్లారి: దేశ అభ్యున్నతి, స్వావలంబన కోసం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ దేశానికి చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని నగరంలో దీన్‌దయాళ్ చిత్రపటానికి పూలమాల సమర్పించిన అనంతరం మాట్లాడారు. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుల్లో దీన్‌దయాళ్ కూడా ఒకరుగా నిలిచారన్నారు. 1916 సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్‌లోని చంద్రఖాన్ గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించారన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారన్నారు. మేనమామ ఇంట్లో పెరుగుతూ కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేసి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరడంతో ఆయన జీవితం మారిపోయిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కోసం చదువును సైతం మానేసి జీవిత కాలం ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేసేందుకు నిర్ణయం తీసుకొని దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. వివిధ పత్రికల్లో ఎడిటర్‌గా కూడా పని చేశారన్నారు.
పార్టీని ముందుకు నడిపించారు
శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరణం తరువాత పార్టీ బాధ్యతలను తీసుకొన్న దీన్‌దయాళ్ పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ కృషి వల్లనే నేడు బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించిందన్నారు.అనంతరం మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా, నగర మాజీ మేయర్ వెంకటరమణ, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీప్రసాద్, కార్పొరేటర్లు మోత్కూర్ శ్రీనివాస్‌రెడ్డి, హనుమంతు, సురేఖ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి