
కల్యాణ కర్ణాటకను వీడని వరుణుడు
రాయచూరు రూరల్: మహారాష్ట్ర పైభాగంలో కురుస్తున్న వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు రెండు అడుగుల మేర నీరు ప్రవహించాయి. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. ఉజ్జయిని, సీనా, బోరి వాగుల నుంచి అధిక ప్రమాణంలో నీరు పారడంతో భీమా నది నుంచి 2.75 లక్షల క్యూసెక్కుల నీరు వదిలారని తహసీల్దార్ సంజీవ్ కుమార్ తెలిపారు. నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలబుర్గి జిల్లాధికారిణి ఫౌజియా తరన్నుమ్ వెల్లడించారు. బీదర్ జిల్లా హులసూరు, బసవ కళ్యాణల మధ్య మహారాష్ట్రకు వెళ్లే రహదారిలో రాకపోకలు పూర్తిగా బంద్ చేశారు. కలబుర్గి జిల్లా దేవలగాణగావ్‌లో భీమా నది ప్రవాహంలో ఘత్తరిగి వంతెన నిండిపోయింది. మణ్ణూరు యల్లమ్మ దేవాలయం నీటిలో మునిగింది. విజయపుర జిల్లా తాళికోటెలో వంతెన దాటుతుండగా ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంలో వెళుతూ నీటి ప్రవాహానికి సంతోష్(22) కొట్టుకు పోయాడు. మహేంతేష్ హొసగౌడ(20) ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వాన నీరు చేరింది.
పొంగి ప్రవహిస్తున్న నదులు
నీటమునిగిన ఆలయాలు