
స్వచ్ఛతపై దృష్టి సారించాలి
హొసపేటె: ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నోంగ్‌జోయ్ మొహమ్మద్ అలీ అక్రమ్ షా సూచించారు. స్వచ్ఛతా హీ సేవ పక్షం రోజుల ప్రచారంలో భాగంగా, జిల్లా పంచాయతీ, హోస్పేట్ తాలూకా పంచాయతీ నగరసభ, సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏక్‌దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా తాలూకా, గ్రామ పంచాయతీ స్థాయిలో స్వచ్ఛత కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ యూనిట్లను నిర్మించడం ద్వారా స్థిరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి జిల్లా పంచాయతీ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. చెత్తను రోడ్లపై వేయరాదని ప్రజలకు సూచించారు. ఇంటి వద్దకు వచ్చే కార్మికులకు చెత్త ఇవ్వాలని సూచించారు. ప్రతి 3 నెలలకు ఒక సారి తమ ఇళ్ల చుట్టూ శ్రమదానం చేయడం ద్వారా జిల్లా అంతటా స్థిరమైన, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ కె.తిమ్మప్ప, గ్రామీణ తాగునీరు, పారిశుధ్య విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దీప, జెడ్పీ చీఫ్ అకౌంటెంట్ రుద్రప్ప అక్కి, సహాయ కార్యదర్శి వీబీ మౌనేషా, సహాయ ప్రణాళిక అధికారి ఎం.ఉమేష్, హోస్పేట్ తాలూకా పంచాయతీ కార్యనిర్వహక అధికారి ఆలం భాషా, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ప్రాజెక్టు జిల్లా కన్సల్టెంట్, జిల్లా పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.