
పీజీలో యువతి అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం: పీజీలో ఉంటున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బాగలకోటెలోని విద్యాగిరి కాలనీలో చోటు చేసుకుంది. సునగ తండాకు చెందిన సీమా రాథోడ్(17) స్థానిక కళాశాలలో ప్రథమ పీయూసీ చదువుతూ పీజీలో నివాసం ఉంటోంది. ఆమె శుక్రవారం స్లాబ్‌హుక్‌కి ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించగా విద్యార్థినులు భయంతో గట్టిగా అరుస్తూ బయటకు పరుగులు తీశారు. అయితే సీమా తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెకు ఫిట్స్(మూర్ఛ) వచ్చాయని కాల్ చేశారని, వచ్చి చూసేసరికి విగతజీవిగా కనిపించిందని, తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. నవనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
మంత్రుల శాఖల్లో
స్వల్ప మార్పులు
దొడ్డబళ్లాపురం: గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అస్తిత్వంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రులు డీకే శివకుమార్, రహీమ్ ఖాన్ శాఖల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈమేరకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో డీకే శివకుమార్‌కు భారీ చిన్న తరహా నీటిపారుదల, బీబీఎంపీ, బీడీఏ, బీఎంఆర్‌డీఏ, బీఎంఆర్‌సీఎల్‌తోపాటు బెంగళూరు నగర అభివృద్ధి బాధ్యతలు నిర్వహించేవారు. తాజాగా వాటితోపాటు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార కింద వచ్చే 5 పాలికెలు, బెంగళూరు నగర జిల్లా పరిధిలోకి వచ్చే అన్ని స్థానిక సంస్థల బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతలు ఇప్పటి వరకూ మంత్రి రహీమ్ ఖాన్ శాఖ పరిధిలో ఉండేవి.
బోనులో చిక్కిన చిరుత
దొడ్డబళ్లాపురం: కొన్ని రోజులుగా కనకపుర తాలూకా కచ్చువనహళ్లి గ్రామస్తులకు కంటికి కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. చిరుత ఆ గ్రామ పరిసరాల్లో సంచరిస్తూ కుక్కలు, పశువులను హతమార్చుతోంది. దీంతో గ్రామస్తులు పొద్దుపోయాక బయటకు రావాలంటే జంకేవారు. అటవీశాఖ అధికారులు స్పందించి గ్రామ సమీపంలో బోను ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఆహారం కోసం వచ్చిన చిరుత బోనులో చిక్కింది. శుక్రవారం అటవీ సిబ్బంది వచ్చి చిరుతను బంధించి తీసుకెళ్లారు.
రష్యా మహిళ,ఆమె పిల్లలను స్వదేశానికి పంపించండి
దొడ్డబళ్లాపురం: తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణలోని రామతీర్థం కొండపై ఉన్న దట్టమైన గుహలో అక్రమంగా నివసిస్తూ అటవీశాఖ సిబ్బందికి పట్టుబడ్డ రష్యన్ మహిళను పిల్లలతోపాటు స్వదేశానికి పంపించేందుకు హైకోర్టు అనుమతించింది. ఆమెకు, ఆమె పిల్లలకు అవసరమైన డాక్యుమెంట్లు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి సూచించింది.
రాష్ట్రం మరో నేపాల్ కాబోతోంది
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తాండవమాడుతోందని, రాబోయే రోజుల్లో రాష్ట్రం మరో నేపాల్‌గా మారినా ఆశ్చర్యపోనక్కరలేదని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ అన్నారు. దావణగెరెలో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైనారిటీలను మచ్చిక చేసుకోవడానికి దిగజారి మాట్లాడుతూ, అదే స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఈక్రమంలో ఆయన హిందూ మతాన్ని అవమానిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభధ్రతలు క్షీణించాయన్నారు. వినాయకచవితి పండుగకు ఎక్కడా లేని నిబంధనలు విధించారని మండిపడ్డారు.

పీజీలో యువతి అనుమానాస్పద మృతి

పీజీలో యువతి అనుమానాస్పద మృతి