
పంచభూతాల్లో డాక్టర్ భైరప్ప లీనం
మైసూరు: వయోసహజ అనారోగ్యంతో బుధవారం బెంగళూరు నగరంలో మృతి చెందిన కన్నడ సీనియర్ సాహితీవేత్త, ప్రముఖ నవలా రచయిత డాక్టర్ ఎస్.ఎల్.భైరప్ప అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం మైసూరు నగరంలోని చాముండికొండ తప్పలిలో ఉన్న శ్మశాన వాటికలో బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోశి, రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జీ.పరమేశ్వర్‌తోపాటు మైసూరు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి డాక్టర్ హెచ్.సీ.మహదేవప్పతో పాటు అనేక మంది నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్యాలెస్ పురోహితులు చంద్రశేఖర్ శాస్త్రి ఆధ్వర్యంలో ఏడు మంది మంది పురోహితులు సాంప్రదాయ పద్ధతిలో విధివిధానాల ప్రకారం భైరప్ప అంత్యక్రియలను పూర్తి చేశారు.
స్థానికులకు అంతిమ దర్శనానికి అవకాశం
ఈనెల 24వ తేదీన బెంగళూరులో గుండెపోటుతో మృతి చెందిన భైరప్ప భౌతికకాయాన్ని 25వ తేదీ సాయంత్రం మైసూరు నగరంలోని కళామందిరంలో ఉన్న కిందరజోగి ఆవరణలో స్థానికుల అంతిమ దర్శనం కోసం ఏర్పాటు చేశారు. అనంతరం రాత్రి జేఎస్‌ఎస్ ఆస్పత్రిలో ఉన్న మార్చురీలో పెట్టి శుక్రవారం ఉదయం 9 గంటలకు భైరప్ప నివాసానికి తీసుకొని వచ్చి కొంత సమయం ప్రముఖుల దర్శనం కోసం అవకాశం కల్పించిన అనంతరం విధి విధానాలు ప్రారంభించి అంత్యక్రియలు పూర్తి చేశారు. డాక్టర్ లక్ష్మీనారాయణ, రైతు సంఘం అధ్యక్షుడు బడగలపుర నాగేంద్ర, సాహితీవేత్త ఫ్రొఫెసర్ కే.ఎస్.భగవాన్, బసవరాజు హొసకోటె, హాళతి సోమశేఖర్, జైనహళ్లి సత్యనారాయణగౌడ, రవీంద్ర స్వామితో పాటు అనేక మంది ప్రముఖులు తరలివచ్చి నివాళి ఆర్పించారు.
వేలాది మంది ఆశ్రునయనాల మధ్య వీడ్కోలు
బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం
అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన వైనం

పంచభూతాల్లో డాక్టర్ భైరప్ప లీనం