
కులగణన లోపాలు నివారించండి
శివాజీనగర: సర్వర్ సమస్య, యాప్‌లో దోషాలు నివారించి కులగణన వేగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్ ఈ నెల 22 నుంచి ప్రారంభించిన విద్య, సామాజిక, ఆర్థిక సమీక్ష 4 రోజులు గడిచినా సక్రమంగా జరగక వివాదానికి గురైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో శుక్రవారం నివాస కార్యాలయం కృష్ణా నుంచి అన్ని జిల్లాధికారుల, జిల్లా పంచాయతీ సీఈఓలు, వివిధ శాఖల ప్రధాన అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కులగణన ఇబ్బందులు తెలుసుకున్నారు. విద్య, ఆర్థిక, సామాజిక సమీక్షకు రాష్ట్ర హైకోర్టు సైతం ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
అన్ని సదుపాయాలు కల్పించండి
సర్వే సక్రమంగా సాగేలా కులగణనదారులకు సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సర్వేలో పలుచోట్ల సమస్యలు వచ్చినట్లు వార్తలు వస్తున్నా పరిష్కరించేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం అధికారులపై మండిపడ్డారు. సమీక్ష సందర్భంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాధికారులతో సమాచారం
ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంలో ప్రతి జిల్లాఽధికారి నుంచి సమాచారాన్ని పొందారు. సమీక్ష సమయంలో ఇబ్బంది కలిగితే దానిని తక్షణమే వెనుకబడిన వర్గాల కమిషన్ దృష్టికి తెచ్చి లోపదోషాలను సరిచేసి కుల గణనను సక్రమంగా జరపాలని తెలిపారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్, మంత్రులు హెచ్.కే.పాటిల్, శివరాజ్ తంగడగి, కృష్ణభైరేగౌడ, రహీంఖాన్, భైరతి సురేశ్, మధు బంగారప్ప, బోసురాజు, వెనుకబడిన వర్గాల కమిషన్ అధ్యక్షుడు మధుసూదన్ నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నజీర్ అహమ్మద్, న్యాయ సలహాదారుడు పొన్నణ్ణ, ఆర్థిక సలహాదారుడు బసవరాజ రాయరెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శి అంజుం పర్వేజ్‌తో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.