
కురుబలను ఎస్టీల్లోకి చేర్చవద్దు
సాక్షి,బళ్లారి: కర్ణాటకలో బలమైన, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందంజలో ఉన్న కురుబ సమాజాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చాలనే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని వాల్మీకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గురువారం అఖండ కర్ణాటక వాల్మీకి నాయక ఐక్య వేదిక, బళ్లారి జిల్లా వాల్మీకి నాయక విద్యాభివృద్ధి సంఘం, అఖిల కర్ణాటక వాల్మీకి మహాసభ, వీరసింధూర లక్ష్మణ యువక సంఘం, ఏకలవ్య యువక సంఘం తదితర వాల్మీకి సమాజానికి చెందిన పలు సంఘాల నాయకులు, కార్యకర్తల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన చేపట్టారు. నగరంలోని నారాయణరావ్ పార్క్ నుంచి రాయల్ సర్కిల్‌కు చేరుకొని బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఆ సంఘం అధ్యక్షుడు జోళదరాశి తిమ్మప్ప మాట్లాడుతూ కురుబ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. దీంతో వాల్మీకులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తమ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఈ ప్రయత్నాన్ని విరమించుకోక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. వాల్మీకి సమాజ నాయకులు జనార్ధన నాయక, జయరాం, హనుమంతప్ప, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.
కురుబలను ఎస్టీల్లో చేర్పించరాదని ర్యాలీ
హొసపేటె: హాలుమత కురుబ కులాన్ని షెడ్యూల్డ్ తెగల కేటగిరిలో ఎట్టి పరిస్థితిలో చేర్పించరాదని డిమాండ్ చేస్తూ గురువారం వాల్మీకి సమాజ సోదరులు నగరంలో ర్యాలీ చేపట్టారు. ర్యాలీని వాల్మీకి సర్కిల్ నుంచి చేపట్టి పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్, తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాలూకా వాల్మీకి సమితి నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించింది. వాల్మీకి సంఘం తాలూకా అధ్యక్షులు గోసల భరమప్ప, కార్యదర్శి దేవరమని శ్రీనివాస్, జంబయ్య నాయక్ తదితరులు మాట్లాడుతూ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు.
బళ్లారి, విజయనగరల్లో
కదం తొక్కిన వాల్మీకులు
పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టి
ప్రభుత్వ తీరును నిరసించిన వైనం

కురుబలను ఎస్టీల్లోకి చేర్చవద్దు