రాయచూరు రూరల్: నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలో గురువారం నూతనంగా పోలీస్ క్యాంటీన్ నిర్మాణ పనులకు ఎస్పీ పుట్టమాదయ్య భూమిపూజ చేశారు. పోలీస్ మైదానంలో రూ.10 లక్షలతో నూతన క్యాంటీన్ నిర్మాణం వల్ల పోలీసులకు, అధికారులకు, ఉద్యోగులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మంచి ఆహార పదార్థాల సేవనకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు కుమారస్వామి, శాంతవీర హరీష్, మేకా నాగరాజ్, ఉమేష్ కాంబ్లే, ఈరణ్ణలున్నారు.
పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలని ర్యాలీ
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు మిగులు భూములు, ఇళ్లు కేటాయించాలని దళిత సంఘర్ష సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ కొప్పర్ డిమాండ్ చేశారు. గురువారం రాయచూరు తాలూకా చంద్రబండలో చేపట్టిన ర్యాలీలో మాట్లాడారు. రారష్ట్‌ర ప్రభుత్వం అటవీ శాఖ ఆధీనంలో సాగు చేస్తున్న భూములను సన్న కారు రైతులకు పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నా అధికారులు రైతులపై కేసులు నమోదు చేస్తుండడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు రాజకీయ నాయకుల కుమ్మక్కుతో స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆరోపించారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే సామెతను నిర్వీర్యం చేస్తున్నట్లు తెలిపారు.
అనాథగా జాతీయ నేతల చిత్రపటాలు
రాయచూరు రూరల్: నగరంలోని నగరసభ కార్యాలయం పైఅంతస్తులో అధికారులు జాతీయ నేతల చిత్రపటాన్ని అవమానించారు. బుధవారం మహాత్మా గాంధీ, బాబూ జగ్జీవన్ రామ్‌ల చిత్రపటాలను నేలపైనే వదిలేసి అవమాన పరిచారని జయ కర్ణాటక సంఘం సంచాలకుడు రవి కుమార్ ఆరోపించారు. ఈ విషయంలో నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, కమిషనర్ జుబిన్ మహాపాత్రో స్పందించక పోవడంపై నిరసన వ్యక్తం చేశారు.
కసాప జిల్లాధ్యక్షుని రాజీనామాకు డిమాండ్
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్ రాజీనామా చేయాలని బెళకు సంస్థ అధ్యక్షుడు అణ్ణప్ప మేటిగౌడ డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్ల నుంచి జిల్లాలో ఎలాంటి సాహిత్య పరిషత్ కార్యక్రమాలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. అనారోగ్యంతో సాహిత్య పరిషత్ సేవలు చేయడానికి చేతకానప్పుడు రాజీనామా చేసి ఇతరులకు అవకాశం కల్పించాలన్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుని అనుమతి లేకుండా నేరుగా ఏడు తాలూకాల అధ్యక్షులను మార్చి నూతన అధ్యక్షులను నియమించారన్నారు. వారం రోజుల్లోపు పాటిల్ రాజీనామా చేయక పోతే పరిపాలనాధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు.
వేశ్యావాటికపై దాడి.. నలుగురు అరెస్ట్
రాయచూరు రూరల్: వేశ్యా వాటికపై దేవదుర్గ పోలీసులు దాడి చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మంజునాథ్ తెలిపారు. బుధవారం రాత్రి కొప్పర రహదారిలో నిర్వహిస్తున్న వేశ్యా వాటికపై దాడి చేసి సుమంగళ(55), రాజవర్దన్(21), ద్యావప్ప(40), రవి(30)లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు, రూ.6,460 నగదు, ఇతర సామగ్రిని స్వాధీనపరచుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

పోలీసు క్యాంటీన్ నిర్మాణానికి భూమిపూజ