యశవంతపుర: జవాన్ ఒకరు భార్యపై కాల్పులు జరిపిన ఘటన కొడగులో జరిగింది. పొన్నంపేట తాలూకా హుదికేరి దగ్గర కొణగేరిలో దీపికా దేచమ్మ (32)పై ఆమె భర్త కరియప్ప తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలైన దీపిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపి కరియప్ప పరారయ్యాడు. కరియప్ప ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఆక్రోశంతో కరియప్ప తుపాకీతో భార్యను కాల్చి పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
అన్నదమ్ముల్ని మింగిన బావి
మైసూరు: బావిలోకి పడిపోయి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఈ దుర్ఘటన చామరాజనగర జిల్లా హనూరు తాలూకా కురుబరదొడ్డి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. హనూరు పట్టణం ఆర్‌ఎస్ దొడ్డి లేఔట్‌కిచెందిన కుమారస్వామి అనే వ్యక్తి కొడుకులు యోగేశ్ (9), సంజయ్ (7) మరణించారు. వారి తండ్రి ఓ బట్టల షాపులో పనిచేసేవారు. దసరా పండుగ సెలవులు కావడంతో పిల్లలు హనూరు పట్టణం ఆర్‌ఎస్ దొడ్డిలోని తమ అమ్మమ్మ ఇంటికి వచ్చారు. గ్రామంలో నూతనంగా తవ్వించిన బావి వద్ద ఆడుకుంటుండగా అదుపుతప్పి అందులో పడ్డారు. కొంతసేపటికి చూసుకున్న స్థానికులు పిల్లల మృతదేహాలను వెలికితీశారు.
చంద్రఘంటగా చాముండి
తుమకూరు: దసరా వేడుకల సందర్భంగా నగరంలోని ప్రభుత్వ పీయూ కాలేజీ మైదానంలో ప్రతిష్టించిన శ్రీ చాముండేశ్వరి దేవీ దర్శనం పొంది ఆ తల్లి కృపకు పాత్రులవ్వాలని జిల్లాధికారి శుభకల్యాణ్ అన్నారు. భర్త, పిల్లలతో కలిసి ఆమె చంద్రఘంట (మీనాక్షి) అలంకారంలో ఉన్న శ్రీ చాముండేశ్వరీ దేవిని దర్శించుకుని పూజలు చేశారు. తుమకూరు దసరా ఉత్సవాలకు వచ్చేందుకు ప్రతి తాలూకా నుంచి 250 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలో విద్యుత్ దీపాలంకరణ వీక్షణకు ఉచితంగా డబుల్ డెక్కర్ బస్సును నడుపుతున్నట్లు చెప్పారు.
పరారీలో తిమరోడి
యశవంతపుర: అక్రమంగా ఇంటిలో తుపాకులు పెట్టుకున్న కేసులో ధర్మస్థల దుష్ప్రచారం నిందితుడు, సామాజిక కార్యకర్త మహేశ్‌శెట్టి తిమరోడి విచారణకు ముఖం చాటేశాడు. పైగా అరెస్టు చేస్తారనుకుని పరారీలో ఉన్నాడు. ఫోన్ స్విచాఫ్ అయ్యింది. స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇంటికి తాళం వేసి 10 రోజులవుతుంది. పోలీసులు జిల్లా బహిష్కరణ నోటీసులు ఇవ్వడానికి వెళ్లగా కనిపించలేదని తెలిపారు. బెళ్తంగడి పోలీసులు గాలిస్తున్నారు.
భార్యపై జవాన్ కాల్పులు