
తుమకూరు దసరాలో హెలీరైడ్
తుమకూరు: తుమకూరులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. సందర్శకులు హెలికాప్టర్‌లో విహారం చేయవచ్చు. విశ్వవిద్యాలయం ఆవరణలో హెలీ రైడ్‌కు హోం మంత్రి జీ.పరమేశ్వర్ దంపతులు శ్రీకారం చుట్టారు. వారే తొలుత హెలికాప్టర్‌లో నగర విహారం చేశారు. జిల్లాధికారిణి శుభ కల్యాణ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్దలకు అయితే రూ.3,900, పిల్లలకు రూ.3,500 రుసుమును చెల్లించి హెలికాప్టర్‌లో నగరం చుట్టూ సంచరించి కొత్త అనుభవాన్ని పొందవచ్చు. 15 నిమిషాల పాటు గగనయాత్ర సాగుతుంది.
కాలువలోకి దూకిన ప్రేమజంట
● యువతి మృతి
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో ప్రేమజంట విషాదానికి గురైంది. భద్రావతి హొసమనె పోలీసు స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఓ 19 ఏళ్ల యువతి ఎరెహళ్లి వద్ద భద్రా కుడి గట్టు కాలువలో శవమై తేలింది. వివరాలు.. భద్రావతి తాలూకా ఎరెహళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బోవి కాలనీవాసులు స్వాతి, సూర్య ప్రేమించుకున్నారు. పెద్దలు మందలించినా వెనకడుగు వేయలేదు. ఇద్దరికీ పెళ్లి చేద్దామని పెద్దలు తీర్మానించారు. అయితే వెంటనే పెళ్లి చేయాలని, వచ్చే ఏడాది వరకు ఆగేది లేదని ప్రియుడు సూర్య పట్టుబట్టాడు. ఈనెల 21న సూర్య, స్వాతి ఉక్కుంద వంతెన వద్ద భద్రా కుడి గట్టు కాలువ వద్దకు చేరుకున్నారు. గొడవ జరగడంతో, ఇద్దరూ పురుగుల మందును తాగి కాలువలోకి దూకారు. అయితే సూర్య కాలువలోని చెట్ల కొమ్మలను పట్టుకొని ఎలానో బయటకు వచ్చాడు. ప్రస్తుతం శివమొగ్గలోని మెగ్గాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చివరకు స్వాతి మృతదేహం మంగళవారం లభ్యమైంది. తల్లిదండ్రులు హొసమనె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు.
ఇద్దరు సీఐల సస్పెండ్
● లంచాలు, అలసత్వం ఆరోపణలు
శివాజీనగర: లంచాలు తీసుకోవడం, విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలతో ఇద్దరు ఇన్సపెక్టర్‌లు, ముగ్గురు పోలీసులను బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ సస్పెండ్ చేశారు. కోరమంగల సీఐ రామరెడ్డి, హలసూరు గేట్ సీఐ హనుమంత భజంత్రి, ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు పోలీసులపై వేటు పడింది. సీఐ భజంత్రి, సిబ్బంది ఓ బంగారు వ్యాపారి నుండి రూ.10 లక్షల వసూలుకు ప్రయత్నించారు. ఇది సీసీ కెమెరాలలో రికార్డయింది. అలాగే పబ్, బార్, రెస్టారెంట్‌లు అవధికి మించి తెరిచి ఉంచారని రామరెడ్డిని తప్పించారు. కమిషనర్ ఇటీవల రాత్రివేళ ఎం.జీ.రోడ్డు, చర్చీ స్ట్రీట్, కోరమంగల, మెజిస్టిక్ కేఎస్‌ఆర్‌టీసీ బస్టాండ్, సఖి వన్ స్టాప్ సెంటర్ తదితర ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో అర్ధరాత్రి దాటినా కొన్ని బార్లు పబ్‌లు పనిచేస్తూనే ఉన్నాయి. దీంతో చర్యలు చేపట్టారు. నగరంలో ఇటీవలి రోజుల్లో బంగారు చోరీలు, దోపిడీలు అధికమవుతున్న నేపథ్యంలో కమిషనర్ రాత్రివేళ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.