
కులగణన సర్వే కిట్ల పంపిణీ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో సోమవారం నుంచి వెనుక బడిన వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న కులగణన నమోదు సర్వేకు అందరూ సహకరించాలని తహసీల్దార్ సురేష్ వర్మ విన్నవించారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో సర్వే చేయనున్న అధికారులకు కిట్లను అందించి మాట్లాడారు. సర్వేలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గ్రామీణ ప్రాంతాల ప్రజలు విద్య, ఉద్యోగ, ఇతర కుల వృత్తుల ఆధారంగా నమోదుకు సమీక్షలు జరుపుతున్నట్లు తెలిపారు. మరో వైపు కులగణన సర్వేకు వెళ్లవలసిన ఉపాధ్యాయినులు వారికి అందించిన కిట్లను సీఎంఆర్ దుకాణం ప్రారంభానికొచ్చిన సినీ నటి సప్తమిగౌడ రావడంతో ఆమెను చూడటానికి వచ్చారు. తాలూకా విద్యాశాఖాధికారి ఈరణ్ణ, ఉప తహసీల్దార్ పరశురామ్‌లున్నారు.
సిద్దారూఢ మఠానికి రూ.28.57 లక్షల కానుకలు
హుబ్లీ: లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం సిద్దారూఢ మఠం సన్నిధిలో ఈ సారి రూ.28.57 లక్షల ఆదాయం లభించింది. ఆ మేరకు స్వామి వారి హుండీలను ఎస్‌బీఐ సిద్దారూఢ నగర శాఖ మేనేజర్, సిబ్బంది, భక్తుల సమక్షంలో ఆదివారం తెరిచి లెక్కించారు. లెక్కింపులో రూ.28.57 లక్షల కానుకలు హుండీల్లో లభించాయి. రూ.20 వేల విలువ చేసే బంగారు ఆభరణాలను భక్తులు సమర్పించారు. ఆగస్టు 20వ తేదీ నుంచి ఈ నెల 17వ తేదీ వరకు 27 రోజులకు గాను పైమొత్తంలో ఆదాయం లభించిందని మఠం మేనేజర్ ఈశ్వర్ తుప్పద ఓ ప్రకటనలో తెలిపారు.
ఆభరణాల చోరుని అరెస్ట్
బళ్లారిటౌన్: గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంటిలో దోపిడీకి పాల్పడిన దొంగను అరెస్ట్ చేసి అతడి నుంచి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రెండు ఇళ్లల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లో చోరీలు జరిగినట్లు కేసులు దాఖలు చేసుకున్న పోలీసులు తెలిపారు. ఆదివారం రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా జాడలదిన్ని గ్రామానికి చెందిన నాగరాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, నిందితుడి నుంచి 74 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు కలిపి రూ.7 లక్షల వరకు సొత్తు స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు.
అభివృద్ధికి ప్రజల
సహకారం అవసరం
రాయచూరు రూరల్: గ్రామాల్లో అభివృద్ధికి ప్రామాణికంగా ప్రయత్నిస్తామని, ప్రజల సహకారం అవసరమని గ్రామీణ శాసన సభ్యుడు బసవనగౌడ దద్దల్ పేర్కొన్నారు. సోమవారం దేవసూగూరులో 451 అడుగుల వీరభద్రేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిల విగ్రహ నిర్మాణాలకు, వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి మరింతగా పాటు పడుతానని అన్నారు.

కులగణన సర్వే కిట్ల పంపిణీ