
నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
బళ్లారి టౌన్: నగరంలోని పటేల్ నగర్‌లో ఉన్న సన్న దుర్గమ్మ దేవాలయంలో సోమవారం నుంచి 9 రోజుల పాటు 10వ వార్షిక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మీనాళ్లి తాయణ్ణ పేర్కొన్నారు. ఆదివారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల్లో భాగంగా నిత్యం హోమాలు, అమ్మవారికి విశేష అలంకరణలు, మహిళలకు ఒడి నింపే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సారి మొత్తం 3000 మంది దాకా మహిళలకు ఒడి నింపే కార్యక్రమం ఉంటుందన్నారు. రోజూ సాయంత్రం లలిత సాహస్త్ర నామం, ఉదయం పూట పిల్లలకు సరస్వతీ దేవి పూజలు, రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. 30వ తేదీన చండీయాగం, మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ, 2వ తేదీ చివరి రోజున సాయంత్రం అమ్మవారిని పల్లకీలో ఊరేగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు స్థానికుల నుంచి ఆర్థిక సహాయం లభించిందని గుర్తు చేశారు. సమావేశంలో అర్చకులు సంతోష్ స్వామి నేతలు ఎర్రిస్వామి, కృష్ణ , వెంకటేష్, హనుమంత, సునిల్, ప్రదీప్, రమేష్, విజయ్ కుమార్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.