
మలెమహదేశ్వర హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా శ్రీక్షేత్రం మలెమహదేశ్వర బెట్టలో కొలువైన మహదేశ్వర స్వామిపై కాసుల వర్షం కురిసింది. శుక్రవారం స్వామివారి హుండీలను లెక్కించగా 29 రోజులకు సంబంధించి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.1.70 కోట్ల నగదు, 30 గ్రాముల బంగారం, 1,100 గ్రాముల వెండి లభించింది. మలెమహదేశ్వర స్వామి బెట్ట బస్టాండు వద్ద ఉన్న వాణిజ్య భవనంలో సాలూరు బృహన్మఠం అధ్యక్షుడు శ్రీశాంతమల్లికార్జున స్వామీజీ, ప్రాధికార కార్యదర్శి రఘు సమక్షంలో హుండీలు లెక్కించారు.
కోరిక తీర్చలేదని
యువతిపై కత్తితో దాడి
దొడ్డబళ్లాపురం: కో లివింగ్ పీజీలో సెక్స్‌కి ఒప్పుకోలేదని యువతిపై వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న బాబు అనే వ్యక్తి యువతిపై కత్తితో దాడి చేసిన నిందితుడు. ఇతడికి వివాహం అవడంతోపాటు ఒక బిడ్డ కూడా ఉంది. అయితే వైట్‌ఫీల్డ్‌లో పీజీలో ఉన్నాడు. ఇటీవల ఒక యువతి అదే పీజీలో చేరింది. ఆమెతో పరిచయం పెంచుకుని ఫోన్ నంబర్ తీసుకుని తరచూ కాల్ చేసేవాడు. గత మూడు రోజులుగా ఆమెను సెక్స్ కోసం వేధించడం ప్రారంభించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ప్రైవేటు ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశాడు. రూ.70 వేలు నగదు ఇవ్వాలని డిమాండు చేశాడు. ఆమె మొబైల్ బలవంతంగా లాక్కొని రూ.14 వేలు తన అక్కౌంట్‌కి వేసుకున్నాడు. ఈక్రమంలో గురువారం మరోసారి సెక్స్ కోసం ఒత్తిడి చేయగా, ఆమె సమ్మతించకపోవడంతో కత్తితో పొడిచాడు. ఘటనపై వైట్‌ఫీల్డ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.
దర్శన్ కేసు విచారణ వాయిదా
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడు దర్శన్ చార్జిషీట్‌పై విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేస్తూ బెంగళూరు 57వ సీసీహెచ్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇద్దరు నిందితులు గైర్హాజరు కావటంతో కేసు విచారణను వాయిదా వేసింది. పవిత్రగౌడ, దర్శన్‌లను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పవిత్రగౌడపై ఉన్న ఆరోపణలపై చార్జిషీట్‌ను దాఖలు చేయాలని ఆమె తరపున న్యాయవాది వాదించారు. అయితే నిందితులు కార్తీక్, కేశవమూర్తి గైర్హాజరు కావటంతో కోర్టు విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. దర్శన్‌కు జైల్లో సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆయన తరపున న్యాయవాది వేసిన పిటిషన్‌పై జైలు అధికారులకు నోటీసులివ్వగా మ్యాన్యువల్ ప్రకారమే సౌకర్యాలు కల్పించినట్లు జైలు అధికారులు కోర్టుకు నివేదించారు. రేణుకాస్వామి హత్య కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీం కోర్టు ఆగస్ట్ 14వ తేదీన రద్దు చేయటంతో 7 మంది నిందితులు మళ్లీ జైలుకు వెళ్లిన సంగతి విదితమే.
కులగణన వాయిదా వేయలేదు
బనశంకరి: కులగణనను వాయిదా వేయలేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం బెంగళూరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ సంస్థ శాశ్వత వెనుకబడిన వర్గాల కమిషన్ అందరి అభిప్రాయం తీసుకుని తీర్మానం చేసిందన్నారు. కులగణనను ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. కేబినెట్‌లో మంత్రుల అసంతృప్తిపై స్పందించిన సీఎం.. బీజేపీ వారు రాజకీయం చేస్తున్నారన్నారు. మేము కూడా రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. ఈ విషయాన్ని ఖండించాలని మంత్రులకు తెలిపామన్నారు. గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కులగణనతో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తరాదన్నారు. కొత్త కులాలను చేర్చడంతో గందరగోళం ఏర్పడుతోందన్నారు. దీనిని సరిదిద్దకుండా కులగణన వద్దు అని, సామాజిక విద్యా సమీక్ష అని ప్రజలకు తెలపడం సాధ్యమౌతుందా? అని ప్రశ్నించారు. కులగణన వాయిదాకు డీకే.శివకుమార్‌తో పాటు 20 మంది మంత్రులు ఆమోదం తెలిపారన్నారు.