
సీఎంను నిందించిన వ్యక్తి అరెస్ట్
యశవంతపుర: సామాజిక మాధ్యమాలలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నిందించిన హాసన్ జిల్లా సకలేశపుర తాలూకాకు చెందిన వసంతకుమార్(40) అనే వ్యక్తిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వసంతకుమార్ గతంలో సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇటీవల మైసూరులో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కన్నడ భాష వస్తుందా? అని అడిగారు. దీంతో వసంతకుమార్ సీఎంను దూషిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. పోలీసులు గాలించి వసంతకుమార్‌ను అరెస్ట్ చేశారు.
సవతి తల్లిపై అత్యాచారం, హత్య
యశవంతపుర: హాసన జిల్లా అరసికెరె తాలూకా జావగల్ గ్రామంలో మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న బాలుడిని పెంచి పెద్ద చేసిన మహిళపై ఆత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బయట పడింది. ఈ నెల 15న జావగల్‌కు చెందిన మహిళ కూలి పనులకు వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. ఏమైందో తెలియక ఆమె ఫోన్‌కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. మరుసటి రోజు మహిళ మృతదేహం అరటితోటలో బయట పడింది. శరీరంపై గాయాలున్నాయి. ఆమె మరణంపై అనుమానం కావటంతో జావగల్ పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. పెంపుడు కొడుకు, ఆమె గొడవ పడుతున్న విషయాన్ని గ్రామస్థుడు ఒకరు పోలీసుల దృష్ఠికి తెచ్చాడు. ఇదే విషయంపై పోలీసులు విచారణ చేపట్టగా తల్లిలా పెంచిన మహిళపై ఆత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది.