
అటవీశాఖలో పెచ్చుమీరిన అక్రమాలు
కోలారు: సామాజిక అటవీ ఉపవిభాగంలో అవినీతి అక్రమాలు జరిగాయని, వాటిపై దర్యాప్తు చేయించాలని దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం అటవీ సంరక్షణాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సమితి సంచాలకుడు మేడిహాళ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు పెచ్చుమీరిపోతున్నాయన్నారు. అటవీశాఖ కార్యాలయంలో అటవీ సంరక్షణాధికారి ధనలక్ష్మి సర్వాధికార ధోరణిని అనుసరిస్తున్నారని ఆరోపించారు. 2019 నుంచి 2023 వరకు శ్రీనివాససపురం తాలూకా మాస్తేనహళ్లి గ్రామ పంచాయతీ వ్యాప్తిలో మొక్కలు నాటిన పనుల్లో, ఉపాధిహామీ పనుల్లో అక్రమాలు జరిగాయన్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమితి సంచాలకుడు వేమగల్ రమేష్, మేడిహాళ భైరప్ప, మాస్తేనహళ్లి కృష్ణప్ప పాల్గొన్నారు.