
అక్టోబర్ 7న వాల్మీకి జయంతి
హొసపేటె: నగరంలోని బళ్లారి రోడ్డులోని పుణ్యానందపురి కళ్యాణ మంటపంలో అక్టోబర్ 7న మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిలాఅధికారి కవిత తెలిపారు. జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఏర్పాట్లపై ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యాసాధన, సామాజిక సేవ, ఉన్నత విద్యలో అత్యున్నత విజయాలు సాధించిన వాల్మీకి సమాజానికి చెందిన విద్యార్థులను సత్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ, గ్రాడ్యుయేషన్‌లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని తెలిపారు. వాల్మీకి మహాసభ తాలూకా అధ్యక్షుడు గోసాల భరమప్ప మాట్లాడుతూ.. వాల్మీకి గురుపీఠం స్వామిజీ, వివిధ ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఒక సమావేశం నిర్వహించి వాల్మీకి జయంతి వేడుకలపై చర్చించామన్నారు. రాష్ట్రంలో వాల్మీకి సమాజం 45 లక్షల జనాభా ఉందన్నారు. ప్రభుత్వం అందించిన 7 శాతం రిజర్వేషన్ ఇప్పటికే ఉపయోగించబడుతోందని తెలిపారు. కానీ ఇతర వర్గాలను అందులో చేర్చి మన హక్కులను ఉల్లంఘించే కుట్ర జరుగుతోందన్నారు. జిల్లా పరిపాలనకు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనే లక్ష్యంతో వాల్మీకి సమాజం నాయకులందరూ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్.జాహ్నవి, అదనపు డిప్యూటీ కమిషనర్ పి.వివేకానంద, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారి కే.రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ వైఏ.కాలే, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
వాల్మీకి జయంతి ఘనంగా నిర్వహిద్దాం
బళ్లారి రూరల్: దావణగెరె నగరంలో అక్టోబర్ 7న వాల్మీకి జయంతిని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దావణగెరె అదనపు జిల్లా అధికారి శీలవంత శివకుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం డీసీ కార్యాలయ సభా ప్రాంగణంలో సంసిద్ధత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని హొండిద సర్కిల్‌లోని రాజవీర మదకరి నాయక విగ్రహానికి పుష్పార్చన చేసిన అనంతరం వాల్మీకి చిత్రపటం ఊరేగింపు ప్రారంభం అవుతుందన్నారు. ఎంసీసీ బ్లాక్‌లోని గుండి మహదేవప్ప కళ్యాణ మండపంలో సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్టీ సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు నాగరాజ్, దూడా కమిషన్ హలిమని తిమ్మణ్ణ కన్నడ సంస్కృతి శాఖ సహ సంచాలకుడు రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.