
24/7 నీటి సరఫరా పథకం అమలులో జాప్యం
హుబ్లీ: హుబ్లీ, ధార్వాడ నగర పాలక సంస్థ అన్ని వార్డుల్లో 24/7 నీటి సరఫరా పథకం విస్తరించే ప్రణాళిక అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. నాలుగున్నర ఏళ్ల నుంచి నత్తనడకన పనులు జరుగుతున్నాయి. పథకంలో భాగంగా సవదత్తి జాక్‌వెల్ నుంచి అమ్మిన బావి వరకు 29.51 కిలోమీటర్ల కచ్చనీటి ముఖ్య ట్యాంక్ అమర్చారు. 43 ఎంఎల్‌డీ సామర్థ్యం కొత్త నీరు సంస్కరణ యూనిట్ రచనాత్మక పనులు ముగిశాయి. యంత్రోపకరణాలు అమర్చే ఎలక్ట్రో మెకానిక్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పథకం ప్రారంభమై దశల వారీగా అమలు అవుతుండటంతో తొలి దశలో జంట నగరాల్లోని 11 వార్డులకు రోజు 24 గంటల నీటి సరఫరా చేస్తున్నారు. గత ఆగస్టు వరకు వివరాలను పరిశీలిస్తే ఇంటి కనెక్షన్లు ఇవ్వడానికి జంట నగరాల్లో 1,688 కిలో మీటర్ల పంపిణీ నెట్‌వర్క్‌కు గాను ఇప్పటి వరకు కేవలం 867 కిలోమీటర్ల మార్గంలో ఇళ్లకు కొళాయిలను ఏర్పాటు చేశారు. దీంతో ఇంటింటికీ నిరంతర నీటి సరఫరా చేయడం పెద్ద సవాల్‌గా మారింది. ప్రాజెక్ట్ అమలులో జాప్యానికి ఇది ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ విషయమై ఈ పథకం అమలు యూనిట్ ఎస్‌ఈ కవిత మాట్లాడారు. రోడ్లు పీడబ్ల్యూడీ జాతీయ హైవే, పాలికె తదితర వివిధ సంస్థ పరిధిలో రావడంతో పైపులైన్ వేయడానికి రోడ్లను ధ్వంసం చేయాల్సి వస్తోందన్నారు. ఇందుకు అనుమతి పొందేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు. 6 రోజుల నుంచి 8 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేసే స్థలాలను కలిగిన మధ్యంతర వార్డుల్లో మేము అనుకున్న ప్రణాళిక మేరకు అవాంతరాలు లేకుండా పనులు జరిగితే అక్టోబర్ చివరి కల్లా 5 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయవచ్చన్నారు. ఇటీవల రాయపురలో నీటి ట్యాంక్ అమర్చడానికి రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. ఈ సమస్యను ప్రస్తుతం పరిష్కరించామన్నారు. ఎలక్ట్రో మెకానిక్ పనులు అలాగే ట్యాంకులకు కనెక్ట్ చేసే ప్రక్రియ అక్టోబర్ చివరి కల్లా పూర్తయితే జంట నగరాల్లోని అన్ని మధ్యంతర వార్డులకు 5 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయవచ్చని వెల్లడించారు.