
అంతులేని అభిమానం
సాక్షి బళ్లారి: ఓ మహిళ సీఎం సిద్ధరామయ్య ఫొటోను ఇంటి వాకిలిపై చిత్రీకరించుకుని అభిమానం చాటుకుంది. సాధారణంగా ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం, పింఛన్, వివిధ పథకాల ద్వారా వచ్చే నగదును అవసరాలకు వాడుకుంటారు. అయితే ఉమ్మడి బళ్లారి జిల్లాలోని కూడ్లిగీ తాలూకా కెంచమనహళ్లి గ్రామానికి చెందిన మల్లేశప్ప తిప్పేస్వామి భార్య పార్వతమ్మ గత 15 నెలలుగా ప్రభుత్వం నుంచి గృహలక్ష్మి పథకం ద్వారా వచ్చిన డబ్బును ఖర్చు చేయకుండా రూ.30 వేలు పోగు చేసింది. నూతన గృహానికి ఏర్పాటు చేసిన తలుపుపై (వాకిలి) సీఎం సిద్ధరామయ్య ఫొటో వేయించుకుంది. సీఎం సిద్ధరామయ్య ఫొటోను దేవుడి ఫొటో తరహాలో చెక్కించామని పార్వతమ్మ తెలిపింది. మామూలుగా ఇంటి ప్రధాన ద్వారాలకు తమ ఇష్ట దేవుడు, ఇంటి దేవుడు భావ చిత్రాలను చెక్కించుకోవడం ఆనవాయితీ. సంప్రదాయానికి భిన్నంగా తమ అభిమాన నాయకుడి ఫొటోను చెక్కించుకోవడం విశేషం.
గృహలక్ష్మి నిధులతో
ఇంటి వాకిలిపై సీఎం సిద్ధరామయ్య
ఫొటో వేయించుకున్న మహిళ