
నిండుకుండలా పెద్ద చెరువు
హొసపేటె: విజయనగర జిల్లాలోని కూడ్లిగితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో కూడ్లిగి తాలూకాలోని పెద్ద చెరువు పొంగి మరువ పారింది. మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ పండించే రైతులకు అవసరమైన వర్షం కురిసింది. దీంతో రైతుల ముఖాల్లో హర్షం వ్యక్తమవుతోంది. చెరువు పొంగి ప్రవహించడాన్ని చూడటానికి పట్టణ ప్రజలు గుమికూడుతున్నారు. నీరు పారుతున్న చోట నిలబడి మొబైల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ యువత సంబరాలు చేసుకుంటున్నారు. ఆగస్టు నెలలో చెరువు పొంగి ప్రవహించడంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. తహసీల్దార్ నేత్రావతి, ఏపీఎంసీ అధ్యక్షుడు కావలి శివప్పనాయక్, చీఫ్ ఆఫీసర్ హెచ్.దాదాపీర్, చిన్న నీటిపారుదల శాఖ ఏఈ కోటేశ్వరరావు, రెవెన్యూ అధికారి ప్రభు చెరువును సందర్శించారు.
కలబుర్గి పాలికె
కాంగ్రెస్ కై వసం ●
● అధ్యక్షురాలిగా వర్శజాన్
● ఉపాధ్యక్షురాలిగా తృప్తిలాఖ్
రాయచూరు రూరల్: కలబుర్గి సిటీ కార్పొరేషన్ 23వ అధ్యక్షురాలిగా వర్శజాన్, ఉపాధ్యక్షురాలిగా తృప్తిలాఖ్‌లను ఎన్నుకున్నారు. గురువారం కలబుర్గి సిటీ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీల మధ్య జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసి అధికారం చేజిక్కించుకుంది. ఇందిరాగాంధీ స్మారక భవన్‌లో జరిగిన ఎన్నికకు ప్రాంతీయ కమిషనర్ జహీరా నసీమా ఎన్నికల అధికారిగా వ్యవహరించి ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ తరపున అధ్యక్షురాలిగా వర్శజాన్, ఉపాధ్యక్షురాలిగా తృప్తిలాఖ్ నామినేషన్లు వేశారు. బీజేపీ తరఫున అధ్యక్ష పదవికి గంగమ్మ, ఉపాధ్యక్ష పదవికి పార్వతి, జేడీఎస్‌కు చెందిన విజయలక్ష్మిరెడ్డి పోటీ పడ్డారు. అధ్యక్షురాలు వర్శజాన్ 36 ఓట్లు, ఉపాధ్యక్షురాలు తృప్తిలాఖ్ 33 ఓట్లుతో విజయం సాధించారు.
ఆశా కార్యకర్తల
డిమాండ్లు తీర్చండి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనం చెల్లించాలని ఆశా కార్యకర్తల సంఘం రాష్ట్రాధ్యక్షుడు సోమశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరిలో జరిగిన ఆందోళనలో రూ.10 వేల వేతనంతో పాటు అదనపు ఇన్సెంటివ్ భత్యాలు చెల్లిస్తామని చెప్పి 8 నెలలు గడుస్తున్నా నేటికీ సర్కార్ స్పందించక పోవడాన్ని తప్పు బట్టారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.వెయ్యి చొప్పున పెంచి ఆశా కార్యకర్తలకు పెంచక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం ఇచ్చే ఇన్సెంటివ్ భత్యాలకు తోడు రాష్ట్ర సర్కార్ రూ.10 వేల వేతనం, పదవీ విరమణ చేసిన వారికి రూ.50 వేల డిపాజిట్ మొత్తం చెల్లించాలని కోరారు.
బార్ అసోసియేషన్‌కు ఎన్నిక
సాక్షి, బళ్లారి: జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శిగా అన్సార్ బాషా ఎన్నికయ్యారు. గురువారం నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయవాదుల సంఘం కార్యాలయంలో జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శిగా అన్సార్ బాషాను ఎన్నుకొన్నారు. గత ఏడాది జరిగిన జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సెక్రటరీ స్థానానికి పోటీ చేసిన అన్సార్ బాషాకు, బసవరాజుకు సమాన ఓట్లు రావడంతో మొదటి ఏడాది బసవరాజు జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శిగా కొనసాగేందుకు ఆమోదముద్ర వేసుకొని రెండో ఏడాది అన్సార్ బాషాను సెక్రటరీగా కొనసాగించాలని తీర్మానం చేయడంతో ఆమేరకు జిల్లా బార్ అసోసియేషన్, ప్రముఖ న్యాయవాదులు అందరూ కలిసి నూతన సెక్రటరీని ఎన్నుకొన్నారు. నూతన సెక్రటరీ అన్సార్ బాషా మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈసందర్భంగా సీనియర్ న్యాయవాది పాటిల్ సిద్దారెడ్డి, యూ.బసవరాజు తదితరులు పాల్గొని అభినందించారు.

నిండుకుండలా పెద్ద చెరువు

నిండుకుండలా పెద్ద చెరువు