
వ్యవసాయ శాఖ జేడీపై చర్యలకు డిమాండ్
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో పండించే వరి ధాన్యం నుంచి వచ్చిన బియ్యంతో భోజనం చేస్తే మనిషికి క్యాన్సర్ వస్తుందని ప్రకటించిన కొప్పళ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు(జేడీ)పై చర్యలు చేపట్టాలని కర్ణాటక అన్నదాత రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు నాగనగౌడ డిమాండ్ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయ నగర జిల్లాల్లో అధిక శాతం వరి పండిస్తున్న రైతులకు ఆ అధికారి ప్రకటన వల్ల ఈ ఏడాది రైతుల నుంచి వరి ధాన్యం, బియ్యం కొనుగోలు చేయడం కష్టకరమవుతుందన్నారు. రసాయనిక పదార్థాలతో కూడిన ఎరువులు, క్రిమి సంహారక మందులు అధికంగా వినియోగించడం వల్ల క్యాన్సర్ వ్యాధి సోకుతుందని అసత్య ప్రచారం చేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని సర్కార్‌ను డిమాండ్ చేశారు.