
ధర్మస్థలలో వివాహిత ఆత్మహత్య
యశవంతపుర: సంచలనాలు జరుగుతున్న ధర్మస్థలలో వినుత (26) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. బుధవారం రాత్రి తన నివాసంలో ఉరి వేసుకొది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. ముళిక్మారుకు చెందిన రమేశ్‌తో పెళ్లి కాగా ధర్మస్థళలో నివాసం ఉంటున్నారు. వినుత ఓ షాపులో పని చేస్తున్నట్లు ధర్మస్థల పోలీసులు తెలిపారు. ధర్మస్థలలో ఇటీవల అసహజ మరణాలు, శవాల తవ్వకాల సమయంలో ఈ ఆత్మహత్య జరగడం చర్చనీయాంశమైంది.
మరో యువతి..
కడుపునొప్పి తట్టుకోలేక ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శివనసముద్ర వద్ద జరిగింది. రామనగర తాలూకా హంగరపాళ్య గ్రామానికి చెందిన నాగేష్ భార్య శకుంతల (23), అనారోగ్యం కారణంగా గత మూడు నెలలుగా శివనసముద్రలోని పుట్టింటిలో ఉంది. కడుపునొప్పి తీవ్రం కావడంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
కార్మికుల పేరుతో రూ.కోట్లు స్వాహా: ఎమ్మెల్సీ
యశవంతపుర: రాష్ట్రంలో వాల్మీకి అభివృద్ధి మండలి, ముడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఇబ్బంది ఎదురైంది. కార్మికుల కోసం ఆరోగ్య శిబిరాలను నిర్వహించిన్నట్లు తప్పుడు లెక్కలు చూపించి కోట్ల రూపాయిలను దండుకున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ కేఎస్ నవీన్ ఆరోపించారు. బెంగళూరులో పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కార్మికశాఖ మంత్రి సంతోష్‌లాడ్‌పై ఆరోపణలు చేశారు. కట్టడ కార్మికులకు అరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు తప్పులు లెక్కలు చూపి కోట్ల రూపాయలను లూటీ చేశారని ఆరోపించారు. మంత్రి సంతోష్‌లాడ్ నేరుగా అవినీతికి పాల్పడినట్లు చెప్పారు. తాను సమాచార చట్టం ద్వారా వివరాలను అడిగితే ఇవ్వడం లేదన్నారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఉగ్ర ఖాతాల సీజ్
బనశంకరి: మంగళూరు కుక్కర్ బాంబు పేలుడు కేసులో ప్రముఖ నిందితుడు సయ్యద్ యాసిన్.. బ్యాంకు అకౌంట్‌లో ఉన్న రూ.29 వేల నగదును ఈడీ అధికారులు జప్తు చేశారు. కొందరు ఉగ్రవాదులు ధర్మస్థల దేవస్థానంలో బాంబుపెట్టి పేల్చివేయడానికి కుట్రపన్నారని ఈడీ తేల్చింది. గతంలో మహమ్మద్ షారిక్ బాంబును ధర్మస్థల మంజునాథస్వామి మందిరంలో పెట్టి పేల్చివేయడానికి కుట్ర చేశాడు. బాంబును ఆటోలో తీసుకెళ్తున్నాడు, బాంబుటైమర్ ను 90 నిమిషాలకు బదులు 9 సెకండ్లకు మార్చడంతో ఆటోలో పేలిపోయి గాయపడడం తెలిసిందే. అతనికి మద్దతుగా హజ్ మునీర్, కల్నల్ అనే కొందరు బ్యాంకు అకౌంట్లను నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. నగదు బదిలీ, బాంబుల తయారీలో మెళకువలు నేర్చుకున్నారు. అనధికార బ్యాంకు అకౌంట్లు, క్రిప్టో కరెన్సీ ద్వారా ఆర్థిక సాయం పొందారు. ఇలా రూ.2.86 లక్షలు నగదు అందింది. ఈ డబ్బుతో బాంబుల తయారీ, ఉగ్రవాద పనులు చేపట్టారు. నిందితులు జైల్లో ఉన్నారు.
నేడు నగరంలో రాహుల్ సభ
శివాజీనగర: ఓటరు జాబితా అక్రమాలకు వ్యతిరేకంగా శుక్రవారం బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ జరుపనుంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ ధర్నా జరుగుతుంది. లక్ష మంది పాల్గొనేలా ఫ్రీడంపార్క్‌లో సభకు ఏర్పాట్లు చేశారు. రాహుల్ గాంధీ ఈ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కాంగ్రెస్ ఎమ్మల్యేలు, ఎంపీలు, మంత్రులు, నేతలకు జనాన్ని తరలించాలని ఆదేశించారు. పార్టీలోని అన్ని స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం సిద్దరామయ్య, డీసీఎం శివకుమార్ ఆదేశించారు. దీంతో ఫ్రీడంపార్క్‌తో సహా పరిసర ప్రాంతాలు జనంతో నిండిపోయే అవకాశముంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు పాల్గొంటారు. ఎన్నికల అక్రమాల ఆధారాలను విడుదల చేస్తానని రాహుల్‌గాంధీ ప్రకటించారు.