
సేంద్రియ సాగు.. ఆరోగ్యం బాగు
సాక్షి, బళ్లారి: గతంలో రైతులు సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేసి వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు సాగు చేసేవారు. ముఖ్యంగా వరినాట్లు వేసే ముందు కానుగ ఆకు, తంగేడు ఆకు తదితర ఆకులు, అలములు వరినాట్లలో వేసి ఆవు పేడ, పశువుల పేడను వేసి అద్భుతంగా వరి పంటను పండించే వారు. వాటిని ఆహారంగా తీసుకొన్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కాదు. అయితే ఏటేటా మారుతున్న కాలానుగుణంగా జనాభా పెరుగుదలతో పాటు నీటి పారుదల వసతి భూమి కూడా ఏటేటా పెరుగుతూ వచ్చింది. గతంలో గ్రామాల్లో ఎక్కువగా నీటిపారుదల సౌకర్యం కలిగిన భూములు ఉండగా ప్రస్తుతం బోరు బావులు పెరగడంతో పాటు తుంగభద్ర ఆయకట్టు భూముల సంఖ్య పెరగడంతో రైతులు రసాయనిక ఎరువుల వాడకంపై ఆసక్తి చూపుతూ పంటలను పండిస్తున్నారు. వివిధ రకాల క్రిమి సంహారక మందులు వాడుతూ తాము పండించిన పంటలు అనారోగ్యకరమైనవని తెలిసినప్పటికీ గత్యంతరం లేక పంట దిగుబడిని పెంచుకునేందుకు క్రిమి సంహారక మందులు, రసాయనిక ఎరువులను వాడుతూ వారికి వారే అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య కోకొల్లలు.
సేంద్రియ సాగుతో అధిక దిగుబడి
ఇటీవల వారం రోజుల క్రితం రాయచూరు జిల్లాలో ఓ రైతు కూరగాయలకు క్రిమి సంహారక మందు పిచికారీ చేసి వాటిని తీసుకెళ్లి మరుసటి రోజు ఇంటిలో వంట చేసుకోవడంతో వాటిని ఆహారంగా తిన్న కుటుంబ సభ్యులు ముగ్గురు మృతి చెందడం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి దయనీయ పరిస్థితులు ఏర్పడుతుండగా రసాయనిక, క్రిమిసంహారక మందుల వాడకంపై రైతుల నుంచి ఏటేటా డిమాండ్ కూడా పెరుగుతుండటం బాధాకరం. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యూరియా, రసాయనిక ఎరువులకు తీవ్ర డిమాండ్ కూడా ఏర్పడి రైతులు వాటిని తీసుకోవడానికి ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్నారు. సులభమైన పద్ధతిలో పంటలు పండించుకోవాలన్న సంకల్పం ఉండటంతో సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు చాలా మంది రైతులు దూరమవుతూ వచ్చారు. ఈనేపథ్యంలో సహజంగానే రసాయనిక, క్రిమి సంహారక మందులకు డిమాండ్ ఏర్పడుతూ వచ్చింది. అయితే తుంగభద్ర ఆయకట్టు కింద పలువురు రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ మంచి దిగుబడిని సాధించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను కూడా పండిస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్నారు.
పాతికేళ్లుగా సేంద్రియ వ్యవసాయమే..
సిరుగుప్ప తాలూకా బైరాపుర గ్రామంలో బీఎం.ఈరప్పయ్య అనే రైతు గత 25 ఏళ్ల నుంచి సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన వరి పంటను పండిస్తూ పలువురు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. పంట పండించిన తర్వాత ముందుగా దుక్కి దున్ని మళ్లీ పంటను వేసే వరకు సేంద్రియ ఎరువులతో సమానంగా వివిధ రకాల గింజలను వేస్తూ నైసర్గికంగా భూమిని సిద్ధం చేసుకుంటారు. మన పూర్వీకులు ఏ విధంగా వరి పండించేటప్పుడు దుక్కిలోకి ఆకులు, అలుములు, పేడ తదితర సేంద్రియ పద్ధతులను అవలంభిస్తుండేవారో అదే తరహాలో పంటలను సాగు చేస్తూ అధిక లాభాలను గడిస్తున్నారు. వరికి రోగం వచ్చినప్పుడు క్రిమి సంహారక మందులకు బదులుగా గోమూత్రం తదితరాలను అనుసరిస్తున్నారు.
సేంద్రియ ఎరువులతో సగం ఖర్చు ఆదా
యూరియా, డీఏపీ తదితర రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడటం ద్వారా ఒక ఎకరాకు రూ.20 వేలు ఖర్చు అవుతుండగా సేంద్రియ ఎరువులతో వరి సాగుకు ముందుగా ప్రణాళికతో రూ.10 వేలు మాత్రమే ఖర్చవుతుందని రైతు పేర్కొంటున్నారు. సేంద్రియ(ఆర్గానిక్) పద్ధతిలో పంటలను సాగు చేయడం సులభతరంగా, ఖర్చు కూడా తక్కువగా ఉంటుందన్నారు. మార్కెట్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వరి, కూరగాయలకు డిమాండ్ కూడా ఉందన్నారు. సేంద్రియ పద్ధతులతో వ్యవసాయం చేస్తున్న ఈరప్పయ్య తరహాలో జిల్లా వ్యాప్తంగా పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇలానే కొనసాగితే ఈ ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల సాగు విప్లవం సృష్టించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా రైతులను కూడా మరింత చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆర్గానిక్ ఎరువుతో పండించిన
ఆహార ఉత్పత్తులే మేలు
పాత పద్ధతిలో సాగుతో
అధిక లాభాలు గడిస్తున్న వైనం

సేంద్రియ సాగు.. ఆరోగ్యం బాగు

సేంద్రియ సాగు.. ఆరోగ్యం బాగు