
పాము కాటుకు బాలిక మృతి
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా వన్నటిగిలో శుక్రవారం రాత్రి పాము కరిచి సిరియమ్మ(4) అనే బాలిక మృతి చెందింది. రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కరవడంతో రాయచూరు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది.
సీసీ రోడ్డు పనులకు భూమిపూజ
రాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రజల సహకారం ఎంతైనా అవసరమని విధాన పరిషత్ సభ్యుడు వసంత్ కుమార్ పేర్కొన్నారు. ఆయన శనివారం రాయచూరు తాలూకా బాయిదొడ్డిలో కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి విడుదలైన రూ.25 లక్షల నిధులతో సీసీ రహదారి నిర్మాణ పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో గ్రామాలకు సాగునీరు, రహదారుల అభివృద్ధి, విద్యుత్ సౌకర్యం వంటి సౌకర్యాలను సమకూర్చడానికి ప్రయత్నిస్తామన్నారు.
బాల సాహిత్య అవార్డు గ్రహీతకు సన్మానం
బళ్లారిటౌన్: కేంద్ర సాహిత్య అకాడమి నుంచి బాల సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ శివలింగప్ప హంద్యాళ్‌ను శనివారం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పత్రికా భవనంలో ఘనంగా సన్మానించారు. ఆయన బాలల సాహిత్యంపై రచించిన గ్రంథాలపై కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాలు అందజేసింది. దీంతో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆయన్ను సత్కరించింది. యూనియన్ రాష్ట్ర సమితి సభ్యుడు వీరభద్రగౌడ, అడహక్ సమితి సభ్యులు మల్లయ్య, వెంకోబ, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
టోల్‌గేట్ల బంద్ కోసం జాగరణ
రాయచూరు రూరల్: రాయచూరు నుంచి దేవదుర్గకు వెళ్లే మార్గమధ్యంలో నిర్మించిన రెండు టోల్‌గేట్లను తొలగించాలని ఒత్తిడి చేస్తూ దేవదుర్గ శాసన సభ్యురాలు కరియమ్మ నాయక్ జాగరణ చేపట్టారు. శుక్రవారం కేడీపీ సమావేశం ముగించుకొని రాత్రి 8 గంటల నుంచి దేవదుర్గ తాలూకా కాకరగల్ టోల్‌గేట్ వద్ద శాసనసభ్యురాలు కరియమ్మ నాయక్ ఆధ్వర్యంలో రైతుల సహకారంతో ధర్నాకు బైటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన టోల్‌గేట్లను తొలగించక పోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని మళ్లీ ధర్నాకు ఉపక్రమించారు. 40 కిలోమీటర్ల అంతరంలోనే రెండు టోల్‌గేట్లను ఏర్పాటు చేయడం భావ్యం కాదని, ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్‌కు విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు.
రైతుల ఆత్మహత్యలను అరికట్టండి
రాయచూరు రూరల్: ఇటీవల నకిలీ విత్తనాలు, క్రిమి సంహారక మందుల విక్రయాలతో రైతులు ఆత్మహత్యలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయించే డీలర్లపై వ్యవసాయ శాఖ అధికారులు దాడి జరిపి వారి లైసెన్స్‌లను రద్దు చేయాలని ఒత్తిడి చేశారు. గత ఏడాది నకిలీ విత్తనాలు, ఎరువుల వినియోగంతో 5 మంది రైతులు మరణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

పాము కాటుకు బాలిక మృతి

పాము కాటుకు బాలిక మృతి

పాము కాటుకు బాలిక మృతి

పాము కాటుకు బాలిక మృతి