దొంగల మొహాన హిట్‌ స్ప్రే | - | Sakshi
Sakshi News home page

దొంగల మొహాన హిట్‌ స్ప్రే

Jul 20 2025 5:57 AM | Updated on Jul 20 2025 3:15 PM

దొడ్డబళ్లాపురం: గొలుసు తెంచుకునేందుకు మహిళపై దాడి చేసిన దొంగలకు ఆమె గట్టిగా బుద్ధి చెప్పింది. బొద్దింకలు, పురుగులు రాకుండా ఇళ్లలో వాడే హిట్‌ స్ప్రేను వారి ముఖాన చిమ్మింది. ఈ సంఘటన బాగలకోట జిల్లా జమఖండి పట్టణం గౌతమబుద్ధ కాలనీలో జరిగింది. పృథ్వి ప్రదీప నవణి అనే మహిళ ఇంటి ముందు ఉండగా బైక్‌పై ఇద్దరు స్నాచర్లు వచ్చి ఆమె మెడలోని చైన్‌ లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో తేరుకున్న ఆమె దగ్గరలో ఉన్న హిట్‌ స్ప్రేను వారి కళ్లల్లోకి కొట్టింది. కళ్లు మంటెక్కిన దుండగులు ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు సంఘటనపై విచారణ జరుపుతున్నారు. ఆమె ధైర్యసాహసాలను పలువురు మెచ్చుకున్నారు.

మాలూరు ఎమ్మెల్యేకు ఈడీ షాక్‌

మాలూరు: మాలూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కె వై నంజేగౌడకు ఈడీ అధికారులు మరోసారి షాక్‌ ఇచ్చారు. 2023లో ఈడీ దాడుల్లో ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 1.32 కోట్ల ఆస్తిని జప్తు చేశారు. నంజేగౌడ కోలారు జిల్లా పాల సంస్థ కోముల్‌ అధ్యక్షునిగా ఉన్న సమయంలో జరిపిన ఉద్యోగాల భర్తీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో రెండేళ్ల కిందట నంజేగౌడ ఇంటిపై ఈడీ దాడులు జరిపింది. అక్రమ ఆర్థిక లేవాదేవీల సమాచారాన్ని సేకరించి రూ. 1.32 కోట్ల విలువ చేసే చర, స్థిరాస్తిని జప్తు చేసింది. ఇప్పుడు దానిని జప్తు చేసినట్లు శనివారం ఈడీ ఎక్స్‌ ఖాతాలో తెలిపింది. దీనిపై స్పందించిన నంజేగౌడ తాను 2021 లో కొన్న ఆస్తిని 2023లో జరిగిన కోముల్‌ నియామకాలతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. ఆ కేసులకు ముందే ఆస్తులను కొన్నట్లు చెప్పారు.

రౌడీ బిక్లు హత్య కేసులో దర్యాప్తు

శివాజీనగర: నగరంలో రౌడీ బిక్లు శివప్రకాశ్‌ హత్య కేసులో నిందితులు లొంగిపోవడానికి ముందుగా పరస్పరం కొట్లాడి గాయపడినట్లు తెలిసింది. నిందితులు కిరణ్‌, విమల్‌, ప్రదీప్‌, సామ్యేల్‌, మదన్‌ అనేవారు తామే హత్య చేశామని భారతీనగర ఠాణాలో లొంగిపోయారు. బిక్లు శివపై దాడి చేసే సమయంలో నిందితులకు కత్తులు తగిలి గాయపడ్డారు. తరువాత హత్యకు వినియోగించిన మారణాయుధాలను పారవేసి వెళ్లారు. లొంగిపోదామా, వద్దా అనే విషయంలో నిందితుల మధ్య గొడవ జరిగి కొట్టుకున్నారు. దీంతో గాయాలైనట్లు విచారణలో తేలింది. మరోవైపు హత్యాస్థలితో పాటు పలు ప్రదేశాలను నిందితులతో మహజర్‌ చేయాల్సి ఉంది. పారేసిన కత్తులు కఠార్లను కనిపెట్టే పనిలో ఉన్నారు. ఏ1 నిందితుడు కిరణ్‌.. తనకు బిక్లు శివ అంటే కక్ష ఉండేదని తెలిపాడు. నిందితుల విచారణలో అనేక అంశాలను సేకరించారు. కేఆర్‌ నగర బీజేపీ ఎమ్మెల్యే బైరతి బసవరాజుకు నోటీసులు ఇచ్చారు.

రూ.40 లక్షల వ్యాపారం దాటితేనే నమోదు

బనశంకరి: బెంగళూరులో చిన్నపాటి వ్యాపారులకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆఫీసుకు వచ్చి వ్యాపార సమాచారం ఇవ్వాలని అందులో తెలిపారు. దీంతో భారీగా పన్నులు వేస్తారని చిరు వ్యాపారులు భయపడుతున్నారు. ఏడాదిలో రూ.40 లక్షల లోపు ఆర్థిక వ్యవహారాలు చేస్తే రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌ నాయక్‌ తెలిపారు. రూ. 40 లక్షలు దాటితే తమ శాఖలో ఐటీ, జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. కొందరు వ్యాపారులకు 2021 నుంచి ఇప్పటి వరకు జరిపిన వ్యవహారాలకు నోటీస్‌ ఇచ్చారు. సర్వీస్‌ లావాదేవీలైతే రూ.20 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. సరుకు ఆధారిత వ్యాపారమైతే రూ.40 లక్షల వరకు మినహాయింపు అని తెలిపారు.

మరో కీచక ఖాకీ

మహిళపై లైంగిక దాడి, వసూళ్లు

దొడ్డబళ్లాపురం: మంగళూరులో ఓ మహిళపై కానిస్టేబుల్‌ కీచక కాండకు పాల్పడిన ఘటన మరువకముందే మరో ఖాకీ ఘోరం బయటపడింది. కుటుంబ సమస్యలతో స్టేషన్‌కు వచ్చిన మహిళను మభ్యపెట్టి పలుమార్లు అత్యాచారం చేసి రూ.12 లక్షలు వసూలు చేసిన ఘటన చెన్నపట్టణ తాలూకా ఎంకే దొడ్డి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. రామనగరలో డీఏఆర్‌ కానిస్టేబుల్‌ పుట్టస్వామి.. చెన్నపట్టణకు చెందిన మహిళను కుటుంబ సమస్యల్ని పరిష్కరిస్తానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె వద్ద రూ.12 లక్షలు తీసుకున్నాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని మహిళ కోరడంతో చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఎంకే దొడ్డి ఠాణాలో ఫిర్యాదు చేసింది. పుట్టస్వామి పరారీలో ఉన్నాడు. కీచక ఖాకీని ఎస్పీ శ్రీనివాస్‌గౌడ సస్పెండ్‌ చేశారు.

చిన్నారిని బలిగొన్న స్కూలు బస్సు

దొడ్డబళ్లాపురం: బస్సులో నుంచి కింద పడి విద్యార్థి మృతిచెందిన సంఘటన మాగడి పట్టణంలో జరిగింది. హొసపాళ్య జనతా కాలనీ నివాసులు లోకేశ్‌, రాధ దంపతుల కుమారుడు రజత్‌ (7), ఎన్‌ఈఎస్‌ కాలనీలోని ఎస్‌పీఎస్‌ స్కూలులో 2వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం రజత్‌ స్కూల్‌ బస్సులో వస్తుండగా బస్సు వేగంగా మలుపు తిరిగింది. ముందు కూర్చున్న రజత్‌ తెరిచి ఉన్న డోర్‌ ద్వారా కిందకు విసిరేసినట్లు పడ్డాడు. బస్సు చక్రం కిందపడడంతో దుర్మరణం చెందాడు. మాగడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement