
కరగ ఉత్సవం
శివాజీనగర: ఐటీ నగరంలో నందిని లేఔట్, కృష్ణానంద నగరలో ఉన్న శ్రీదేవి, మారియమ్మ దేవాలయంలో కరగ ఉత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి 10.30 గంటలకు అగ్నిగుండంలో నడుస్తూ కరగ వేడుకను ప్రారంభించారు. పద్మావతి అనే మహిళ కరగను మోసుకొని యశ్వంతపురం ఏపీఎంసీ యార్డ్, శంకర్‌నగర, గౌతమ్‌నగర తదితర ప్రాంతాలలో నాట్యమాడుతూ వెళ్లారు. మంగళ వాయిద్యాలతో వందలాది భక్తులు పాల్గొన్నారు. రోడ్డు పొడవునా స్థానికులు నీళ్లు చల్లి హారతులిచ్చి ఆహ్వానించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కే.గోపాలయ్య, జీ.వెంకటేశ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
మారికాంబకు విశేష పూజలు
మాలూరు: పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ మారికాంబ దేవి ఆలయంలో ఆషాఢ శనివారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి అభిషేకం, వేదమంత్ర పారాయణం, కలశ స్థానన, గణపతి పూజ, తదితరాలను నెరవేర్చారు. ఫల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మహిళలు తంబిట్టు దీపాలను సమర్పించారు.
కలెక్టరు కారు సీజ్
● కాంట్రాక్టరుకు బిల్లుల బకాయిలు
దొడ్డబళ్లాపురం: కాంట్రాక్టరుకు బిల్లు చెల్లించలేదని కలెక్టర్ కారును సీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. శనివారంనాడు కోర్టు ఆదేశాలతో బెళగావి కలెక్టర్ కారును సీజ్ చేసి కోర్టుకు అప్పగించారు. 1992–93లో చిక్కోడిలోని దూద్‌గంగ నదికి మీద కాంట్రాక్టర్ దివంగత నారాయణ గణేశ్ కామత్ బ్యారేజ్ నిర్మించారు. ఈ పనుల బిల్లులు పాస్ చేయలేదు. 1995లో కామత్ కోర్టును ఆశ్రయించారు. బిల్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కానీ నీటిపారుదల శాఖ హైకోర్టులో సవాల్ చేసింది. మళ్లీ దిగువకోర్టులో పిటిషన్ వేయగా, కాంట్రాక్టర్‌కు వడ్డీతో కలిపి మొత్తం రూ.1.31 కోట్లు చెల్లించాలని 2024 జూన్‌లో తీర్పు ఇచ్చింది. కానీ చెల్లింపులు మాత్రం జరగలేదు. దీంతో కలెక్టర్ కారు సీజ్ చేసి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
విహారయాత్రలో ప్రమాదం
● 25 మందికి గాయాలు
యశవంతపుర: వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఘాట్ రోడ్డు మలుపులో పల్టీ పడి 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా దేవనగూల్ గ్రామం వద్ద శనివారం ఉదయం జరిగింది. వారాంతం కావడంతో కుదురేముఖలోని ఓ కంపెనీ ఉద్యోగులు నేత్రావతి పర్వతం చూడాలని బయల్దేరారు. దేవనగూల్ గ్రామం వద్ద మలుపులో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఓ వైపునకు పడిపోయింది. గాయపడిన ప్రయాణికులను మూడిగెరె, చిక్కమగళూరు ఆస్పత్రులకు తరలించారు.
అంబులెన్స్ ప్రమాదంలో రోగి మృతి
మణిపాల్ ఆస్పత్రికి రోగిని తరలిస్తుండగా అంబులెన్స్ డివైడర్‌ను ఢీకొని రోగి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. ఉడుపి ఎంజీఎం కాలేజీ ఎదురుగా డివైడర్‌ను ఢీకొంది. అప్పటికే అస్వస్థతతో ఉన్న రోగి గాయపడ్డాడు. మరో అంబులెన్స్‌లో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు వదిలాడు.

కరగ ఉత్సవం

కరగ ఉత్సవం

కరగ ఉత్సవం