
రాయచూర్ జిల్లా మస్కీలో బహిర్గతమైన పురాతన ప్రాంతం
మల్లికార్జున కొండ, ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో కనుగొన్న పురాతత్వవేత్తలు
రాయచూర్: మానవాళి గతకాలపు జ్ఞాపకాలు, సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టే ప్రాచీన నాగరికత అంటే ఎంతో మందికి మక్కువ. అలాంటి 4,000 ఏళ్లనాటి భారతీయ నాగరికత తాలూకు అవశేషాలు తాజాగా కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో బయటపడ్డాయి. మస్కి పట్టణంలోని మల్లికార్జున కొండ, ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో తవ్వకాలు జరపగా ప్రాచీననాగరికతను తెలిపే రాళ్లసముదాయం బయల్పడింది. వీటితోపాటు ఆనాటి శిల్ప కళాఖండాలు లభించాయి. భారత ప్రాచీన నాగరికత పరంగా మస్కి ఎంతో కీలకమైన ప్రాంతమని మరోసారి నిరూపితమైంది. దశాబ్దాల క్రితం ఇదే మస్కి పట్టణంలో బ్రహ్మీ లిపిలో చెక్కిన అశోకుని కాలంనాటి శిలాశాసనాన్ని గుర్తించారు.
ఎనిమిది లైన్ల ఆ శాసనంలో దేవనంప్రియ, ప్రియదర్శి అనే పదాలు అశోకుని మారుపేర్లు అని అప్పట్లో చర్చ జరిగింది. భారత్‌తోపాటు అమెరికా, కెనడాలకు చెందిన 20 మందితోకూడిన పురాతత్వ పరిశోధకుల బృందం ఈ తవ్వకాలను స్వయంగా పర్యవేక్షించింది. క్రీప్తూపూర్వం 11 లేదా 13వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో మానవుడు నివసించినట్లు ఆధారాల బట్టితెలుస్తోందని పరిశోధనా బృందం తెలిపింది. కళాత్మకమైన వస్తువులు, మట్టి కుండలు, చిన్నపాటి ఉపకరణాలు, పరికరాలు, వంట పాత్రలు ఇక్కడి తవ్వకాల్లో లభించాయని బృందం వెల్లడించింది. అప్పటి ఆచార, సంప్రదాయాలను పాటిస్తూనే ఆనాడు అభివృద్ధి చెందిన సాంకేతికతను ఉపయోగించినట్లు ఇక్కడ లభ్యమైన వస్తువులను బట్టి తెలుస్తోంది.
అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ ఆండ్రూ ఎం.బేయర్, కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ పీటర్ జి.జోహాన్సెన్, భారత్‌లోని శివ్‌నాడార్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. భారత పురాతత్వ విభాగం(ఏఎస్‌ఐ) నుంచి పూర్తిస్థాయి అనుమతులు వచ్చాక గత మూడు నెలలుగా విస్తృతస్థాయిలో పరిశీలన తర్వాత ఎంచుకున్న ప్రదేశాల్లో ఈ బృందం తవ్వకాలు మొదలెట్టి సత్ఫలితాలను సాధించింది. తొలుత 271 ప్రాంతాలను తవ్వకాల కోసం ఎంచుకున్నా తుదకు కొన్ని చోట్ల మాత్రమే తవ్వకాలు చేపట్టారు.
4,000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో చాన్నాళ్లపాటు మానవుడు స్థిరనివాసం ఏర్పర్చుకుని ప్రశాంత జీవనం కొనసాగించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోందని బృందంలోని రీసెర్చర్ కాదంబి చెప్పారు. దక్షిణభారత దేశ ప్రాచీన నాగరికత ఘన చరితకు ఈ ప్రాంతం అద్దంపడుతోందని అన్నారు. తుంగభద్రకు ఉపనది అయిన మస్కీ నదీతీరంలో ఈ మస్కి పట్టణం వెలసింది. మహాసంఘ, మాసంగిపుర అనే పేర్ల నుంచి మస్కి అనే పేరు పుట్టిందని తెలుస్తోంది. 1915లో బ్రిటన్‌కు చెందిన బంగారు గనుల ఇంజనీర్ సి.బీడన్ ఈ ప్రాంతంలో కలియతిరుగుతూ ఇక్కడి కొండమీది శిలాశాసనాన్ని గుర్తించారు.