
పన్నుల వాటాలో కేంద్రం అన్యాయం
మైసూరు: మన రాష్ట్రం నుంచి ఏటా పన్నుల రూపేణా కేంద్ర ప్రభుత్వానికి రూ.4.50 లక్షల కోట్లకు పైగా నగదు వెళ్తోంది, కానీ కేంద్రం రాష్ట్రానికి పన్నుల వాటాగా రూ.65 వేల కోట్లను మాత్రమే అందిస్తూ తీరని అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. శనివారం మైసూరులోని మహారాజ కాలేజీ మైదానంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవ సభ అట్టహాసంగా జరిగింది. సీఎం సిద్దు, డీసీఎం శివకుమార్, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ కర్ణాటక రూ.100 పన్ను చెల్లిస్తోంటే, అందులో కేంద్రం నుంచి రూ.2 మాత్రమే రాష్ట్రానికి తిరిగి ఇస్తున్నారని, పన్నుల్లో జరుగుతున్న అన్యాయం ఇదేనని ఆరోపించారు.
గజగజ వణుకుతారు
రాష్ట్రంలోని ప్రతిపక్ష ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు మోదీని చూస్తే వీరందరికీ భయమని, గజగజ వణుకుతారని బీజేపీ, జేడీఎస్‌లను సీఎం హేళన చేశారు. తాము ఏటా పంచ గ్యారెంటీలకు రూ.55 వేల కోట్లను ఖర్చు చేస్తున్నామన్నారు. గ్యారెంటీ పథకాలను నిలిపేది లేదన్నారు. కర్ణాటక నమూనాను ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాధికారి జీ.లక్ష్మీకాంతరెడ్డి, నగర పోలీసు కమిషనర్ సీమా లాట్కర్, వందలాది ప్రజలు పాల్గొన్నారు.
రూ.4.50 లక్షల కోట్లు వెళ్తుంటే..
రూ.65 వేల కోట్లే తిరిగి ఇస్తోంది
ప్రధాని మోదీపై సీఎం సిద్దు విమర్శలు
మైసూరులో బృహత్ సభ

పన్నుల వాటాలో కేంద్రం అన్యాయం