
నాలుగేళ్ల లావాదేవీలకు ఒకేసారి పన్ను
యూపీఐ చెల్లింపుల ఆధారంగా జీఎస్టీ
11వేల మందికి నోటీసులు జారీ చేసిన జీఎస్‌టీ విభాగం
బెంగళూరు: యూపీఐ చెల్లింపులు చిన్నతరహా వ్యాపారులకు ముప్పుగా పరిణమించాయి. వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి రాని వ్యాపారులను సైతం ఇవి బెంబేలెత్తిస్తున్నాయి. కర్ణాటకలోని హవేరికి చెందిన శంకర్‌గౌడ చిన్న కూరగాయల దుకాణం నడుపుతున్నాడు. రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలను కొని తన దుకాణంలో విక్రయిస్తుంటాడు. జీఎస్టీ రూ.29 లక్షలు చెల్లించాలంటూ శంకర్‌గౌడకు ఇటీవల నోటీసులొచ్చాయి.
నాలుగేళ్లుగా కూరగాయలు అమ్ముతున్న శంకర్‌గౌడ.. మొత్తం రూ.1.63 కోట్ల లావాదేవీలు చేసినందున ఇప్పుడు 29 లక్షల జీఎస్‌టీ కట్టాలన్నది సారాంశం. తాను ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేస్తానని, రికార్డులు కూడా నిర్వహిస్తానని అయినా రూ.29 లక్షల జీఎస్టీ చెల్లించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్క శంకర్‌గౌడనే కాదు.. రాష్ట్రంలో వేలాది మంది కూరగాయ విక్రేతలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
వాస్తవానికి క్లియర్ టాక్స్ ప్రకారం, తాజా పండ్లు, కూరగాయల విక్రయం జీఎస్టీ పరిధిలోకి రాదు. రైతుల నుంచి కొనుగోలు చేసి, ఎలాంటి ప్రాసెస్ చేయకుండా విక్రయించే ఈ వస్తువులకు జీఎస్టీ వర్తించదు. అయినా ఆదాయాన్ని బట్టి నోటీసులు ఇవ్వడమేంటని కూరగాయల వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. బ్యాంకులు లేదా డిజిటల్ మాధ్యమాల్లో చెల్లింపులు చేసినప్పుడు ఈ లావాదేవీలు పన్ను అధికారుల పరిశీలనలోకి వెళ్తున్నాయి.
వ్యాపారి మొత్తం అమ్మకాలు ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే, ఆధారాలు, రికార్డులను అడిగే హక్కు పన్ను శాఖకు ఉంటుంది. ఇదే వ్యాపారులకు శాపంగా మారింది. దీంతో... చాలా మంది చిన్న తరహా వ్యాపారాలు డిజిటల్ చెల్లింపులు నివారించి, నగదు మాత్రమే తీసుకుంటున్నారు. వ్యాపారులు నగదుకు మారుతున్న విషయం తమకు తెలిసిందని, యూపీఐ లేదా నగదు ఏదైనా సరే.. వచ్చిన మొత్తానికి పన్ను వర్తిస్తుందని జూలై 17న కర్ణాటక జీఎస్‌టీ విభాగం హెచ్చరించింది.
రూ.40 లక్షల టర్నోవర్ దాటితే...
రూ.40 లక్షల కంటే ఎక్కువ యూపీఐ టర్నోవర్ ఉన్న 11,000 వ్యాపారులకు నోటీసులు అందజేసింది. నోటీసులను ఉపసంహరించుకోవాలని వర్తక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీఎస్‌టీ నోటీసులను నిరసిస్తూ కర్ణాటక అంతటా టీ స్టాళ్లు, బేకరీలతో సహా మొత్తం చిన్న వ్యాపారాలను జూలై 25న రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేస్తామని హెచ్చరించాయి. యూపీఐ డేటాను యాక్సెస్ చేయడం చట్టబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తం లావాదేవీల ఆధారంగా, విక్రేతలకు పన్ను నోటీసులు జారీ చేయడం అన్యాయమంటున్నారు. సరైన తనిఖీలు లేకుండా జీఎస్టీ కట్టాలంటూ శిక్షించడం తమను దోచుకోవడమేనంటున్నారు.
పరిమితిపై పునరాలోచించాలి..
ఇలాంటి జీఎస్‌టీ నోటీసులు కొనసాగితే, చాలా మంది డిజిటల్ చెల్లింపులకు దూరమవుతారు. కాబట్టి జీఎస్టీ రిజిస్ట్రేషన్ పరిమితిపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైందని నిపుణులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపు దారులలో జీఎస్టీపై అవగాహనను, ముఖ్యంగా కొత్తగా ఈ లావాదేవీల్లోకి ప్రవేశిస్తున్నవారికి మరింత చైతన్యం కలి్పంచాల్సిన అవసరముందని చెబుతున్నారు. లేదంటే.. వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను మినహాయిస్తారని, ఇది నగదు రహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోలేదని చెబుతున్నారు.