
కలెక్టరు బ్యాటింగ్
తుమకూరు: ఫోటోగ్రాఫర్ల రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ ఆరంభమైంది. ఆరోగ్యకర జీవనం కోసం ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలని, వ్యాయామం చేయాలని కలెక్టర్ శుభ కళ్యాణ్ అన్నారు. జిల్లా ఫోటో, వీడియోగ్రాఫర్ల అసోషియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ ప్రీ యూనివర్శిటీ కాలేజీ మైదానంలో పోటీలు ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సరదాగా బ్యాటింగ్ చేశారు. ఎమ్మెల్యే జ్యోతి గణేష్, డా.శివానంద శివ, సభ్యులు పాల్గొన్నారు.
ఇక్కడ మోసం చేసి..
ఇండోర్‌లో వ్యాపారం
బనశంకరి: బెంగళూరు ఎస్‌బీఐ నుంచి రూ.8 కోట్ల రుణం తీసుకుని 20 ఏళ్ల నుంచి పరారీలో ఉన్న మణి, ఎం.శేఖర్ అనే మోసకారి దంపతులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2003లో వీరిద్దరూ గృహ నిర్మాణాల పేరుతో నకిలీ రికార్డులు సృష్టించి ఎస్‌బీఐ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. తరువాత మోసాన్ని గుర్తించి బ్యాంక్ అధికారులు కేసు పెట్టారు. సీబీఐ వీరిపై కోర్టులో 2005లో చార్జిషీట్ వేసింది. ఒకరోజు విచారణకు వచ్చిన శేఖర్, మణి తరువాత పరారయ్యారు. అప్పటి నుంచి సీబీఐ గాలిస్తున్నా జాడ లేదు. ఇటీవల సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మణి, శేఖర్ ఇండోర్ నగరంలో దాక్కున్నట్లు గుర్తించారు. అక్కడ కృష్ణకుమార్ గుప్తా, గీతాకృష్ణ కుమార్‌గుప్తా అనే పేర్లతో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. అరెస్టు చేసి బెంగళూరుకు తరలించారు.
కన్నడ జెండా కోసం లేఖ
శివాజీనగర: కన్నడనాడుకు ప్రత్యేకంగా పసుపు–ఎరుపు జెండాకు అధికారిక గుర్తింపు ఇవ్వాలని కన్నడ, సంస్కృతి మంత్రి శివరాజ్ తంగడగి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. 2017లోనే జెండా అధికార గుర్తింపును కోరుతూ కేంద్రానికి అప్పటి ప్రభుత్వం వినతి చేసింది.