కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కేదెవరికో? | Sakshi
Sakshi News home page

కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కేదెవరికో?

Published Sat, May 20 2023 12:16 AM

- - Sakshi

కోలారు: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రిగిరి ఎవరికి దక్కుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. జిల్లా నుంచి ఈసారి నలుగురు అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో బంగారుపేట ఎమ్మెల్యే ఎస్‌ ఎన్‌ నారాయణస్వామి వరుసగా మూడోసారి గెలిచి హాట్రిక్‌ విజయం సాధించారు. తనకు ఎస్సీ కోటా కింద మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు. కేజీఎఫ్‌ నుంచి వరుసగా రెండోసారి అత్యధిక మెజారిటీతో గెలిచిన రూపా శశిధర్‌ కూడా తనకు ఎస్సీ మహిళా కోటా కింద మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావిస్తున్నారు.

కోలారు నుంచి కొత్తూరు మంజునాథ్‌ కూడా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఇక మాలూరు నుంచి కైవె నంజేగౌడ కూడా వరుసగా రెండోసారి విజయం సాధించారు. వీరంతా తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నారు. శ్రీనివాసపురం నుంచి పోటీ చేసి ఓడిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కె ఆర్‌ రమేష్‌కుమార్‌కు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గంలో స్థానం కల్పించి ఎమ్మెల్సీని చేయాలని ఆయన అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు.

వీరే కాకుండా ఈ సారి కేంద్ర రాజకీయాలను కాదని అసెంబ్లీకి పోటీ చేసి దేవనహళ్లి నుంచి గెలిచిన కెహెచ్‌ మునియప్పకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని జిల్లా నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. జిల్లాలో, రాష్ట్రంలో సీనియర్‌ నాయకుడుగా, పలుమార్లు కేంద్ర మంత్రివర్గంలో పని చేసిన అనుభవం కలిగిన కెహెచ్‌ మునియప్పకు దళిత కోటా కింద మంత్రి పదవి వరిస్తుందని ఆశిస్తున్నారు. ఈనేపథ్యంలో జిల్లా నుంచి పార్టీ అధినాయకత్వం ఎవరికి మంత్రిగిరిని కట్టబెడుతుందో వేచి చూడాల్సిందే.

కొత్తూరు మంజునాథ్‌, రూపా శశిధర్‌, ఎస్‌ ఎన్‌ నారాయణస్వామి, కె వై నంజేగౌడ , కె ఆర్‌ రమేష్‌కుమార్‌, కెహెచ్‌ మునియప్ప

1/5

2/5

3/5

4/5

5/5

Advertisement

తప్పక చదవండి

Advertisement