కరీంనగర్ కార్పొరేషన్: నగరవాసులకు మెరుగైన సేవలు అందించేందుకు మరిన్ని ఆధునిక యంత్రాలు వినియోగంలోకి తెస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. రూ.కోటితో కొనుగోలు చేసిన జేసీబీ, ల్యాడర్లను బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ వై.సునీల్రావుతో కలిసి ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ నగరం గణనీయంగా విస్తరిస్తోందన్నారు. ఆస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు యంత్రాలు అనివార్యమయ్యాయన్నారు. త్వరలోనే రెండు వైకుంఠరథాలను కొనుగోలు చేయనున్నామని, ఇటీవల రెండు ఫాగింగ్ యంత్రాలు, 66 రిక్షాలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నామన్నారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అధికారులు పాల్గొన్నారు.
నగరాన్ని అగ్రగామిగా నిలుపుతాం
నగరాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. 21వ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్, దివ్యాంగుల కాలనీల్లో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు స్థానిక కార్పొరేటర్ వరాల నర్సింగంతో కలిసి శంకుస్థాపన చేశారు. యూఐడీఎఫ్ నిధుల కింద 21వ డివిజన్కు రూ.70 లక్షలు కేటాయించి, పనులు చేపట్టామన్నారు.


