విద్యానగర్(కరీంనగర్): మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ అని డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్డి యశ్వంత్ సింగ్ అన్నారు. నగరంలోని శక్తిసదన్లో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రకృతి ముఖ్య కార్యనిర్వహణాధికారి మూగ జయశ్రీ సౌజన్యంతో శక్తిసదన్లోని మహిళలకు కొత్త దుస్తులు అందించారు. డీఎల్ఎస్ఏ సభ్యులు, న్యాయవాది ఎ.కిరణ్కుమార్, శక్తిసదన్ సూపరింటెండెంట్ ఎ.రమాదేవి, రజిత, వసంత, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని ముకరంపురలో ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపా రు. 64వ డివిజన్లోని ముకరంపుర జాఫ్రీమసీదు ప్రాంతంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్ పడాల శ్రీజతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వర్షాకాలం ముకరంపుర ముంపునకు గురవుతుండడంతో ఈ ప్రాంత వాసులతో పాటు, కరీంనగర్–సిరిసిల్ల రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. టూటౌన్ పోలీసు స్టేషన్ వద్ద నాలా నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించామన్నారు.డ్రైనేజీ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు యూసీఎఫ్ పథకంలో రూ.130 కోట్లు కేటాయించి, టెండర్ ప్రక్రియను చేపట్టామని వెల్లడించారు. నగరపాలకసంస్థ డీఈ ఓంప్రకాశ్, ఏఈ గట్టుస్వామి, అజయ్గౌడ్, అహ్మద్ పాల్గొన్నారు.
వరదకాలువ ద్వారా నీరు
కరీంనగర్ రూరల్: జిల్లాకు ఎస్సారెస్పీ నీటి ప్రవాహం తక్కువగా ఉన్న దృష్ట్యా వరద కాలువ ద్వారా అదనపు నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఇరిగేషన్ సీఈ సత్యనారాయణరెడ్డి తెలిపారు. కరీంనగర్ మండలానికి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేసే రేవెళ్లి క్రాస్రెగ్యులెటర్ను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ నుంచి వస్తున్న 800 క్యూసెక్కుల నీరు పెద్దపల్లి జిల్లాకు మాత్రమే సరిపోతాయని అధికారులు సీఈకి వివరించారు. 3వేల క్యూసెక్కుల నుంచి 3500వరకు నీటి ప్రవాహం ఉన్నట్లయితేనే కరీంనగర్ మండలానికి నీళ్లు వచ్చే అవకాశముందని వివరించారు. వరదకాలువ నుంచి వచ్చే నీటిని జిల్లాకు సరఫరా చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని సీఈ సత్యనారా యణరెడ్డి అన్నారు. ఎస్ఈ ఎం.రమేశ్, ఈఈ తిరుపతిరావు, డీఈ సంతోష్ పాల్గొన్నారు.


