కరీంనగర్ కార్పొరేషన్: నగర పాలక సంస్థకు చెందిన ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పాలకసంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆస్తులు, ఖాళీ స్థలాలు, భవనాలు, పార్కులు, రిజర్వాయర్లు, ఫిల్టర్ బెడ్, క్రీడ ప్రాంగణాలు, వైకుంఠధామాలు, మార్కెట్లు, స్లాటర్ హౌజ్‌లు తదితర ఆస్తుల వివరాలను సమగ్రంగా రికార్డు చేయాలన్నారు. ప్రజావాణి వినతులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, బల్దియా వాహనాల ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, ఫ్యూయల్ సెన్సార్, వాహనాల రికార్డులను లైవ్‌లో తనిఖీ చేశారు.
ఆన్లైన్లో సెలవు దరఖాస్తులు
ఉద్యోగులు ఇకనుంచి సెలవులను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఆన్లైన్ లీవ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్‌ను ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి ఈ సిస్టమ్ ద్వారానే సెలవు దరఖాస్తు చేసి, ఎప్పటికప్పుడు స్టేటస్ తెలుసుకోవచ్చన్నారు. అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్ వేణుమాధవ్ సహాయ కమిషనర్ రాజమనోహర్, ఈఈ లచ్చిరెడ్డి ఉన్నారు.
డంప్‌యార్డు సమస్య పరిష్కారానికి కృషి
డంప్ యార్డు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. డంప్‌యార్డును మంగళవారం సందర్శించారు. మంటలు, పొగలు రాకుండా చేపట్టిన చర్యలను తనిఖీ చేశారు. ఇప్పటికే బయోమైనింగ్ ద్వారా చెత్తను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్ నోటీసుల పరిష్కార ప్రక్రియలో భాగంగా అర్బన్, రూరల్, కొత్తపల్లి మండలాల తహసీల్దార్లు, బీఎస్వోసూపర్ వైజర్లతో సమీక్షించారు. రెండో దశ ఎస్ఐఆర్ ప్రక్రియలో హియరింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలన్నారు.


