కరీంనగర్: వైద్య ఆరోగ్యశాఖలో సుమారు 20 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న వారిని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్హెచ్ఎం ఉద్యోగులు విధులను బహిష్కరించి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో సుమారు 500 మంది, రాష్ట్రవ్యాప్తంగా 17వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారని, వారిని క్రమబద్ధీకరించడం ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం కాదన్నారు. అర్హులను రెగ్యులరైజ్ చేయకుండా దొడ్డిదారిన నియామకాలు చేపట్టడం సరికాదని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని, రామగుండం పర్యటనకు రానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్యోగులకు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎన్హెచ్ఎం జేఏసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఈ.రమేశ్, ఉపాధ్యక్షుడు ఎండీ.ఖాలీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటేశ్, జాయింట్ సెక్రటరీ కే.రమేశ్, జిల్లా కోఆర్డినేటర్ ఎస్.సాగర్ పాల్గొన్నారు.


